బస్సులో రక్షణగా వెళ్తున్న పోలీసు అధికారి
నల్లగొండ రూరల్ : ఆర్టీసీ కార్మికుల నిరసన కొనసాగడంతో మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు డిపో దాటలేదు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌గా పనిచేసేందుకు వచ్చి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని ఆర్టీసీ కార్మికులు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పూలు అందజేసి బతిమిలాడారు. వినని వారిపై దాడి చేసినట్లు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో చర్చించుకున్నారు. పోలీసులు బలవంతంగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను నియమించి పోలీస్ పహారా మధ్య బస్సులను రోడ్డెక్కించారు. దాడులు చేస్తున్నారన్న విషయం గుప్పుమనడంతో తాత్కాలికంగా పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్లు జంకారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ప్రాంతంలో కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చేవారిని అడ్డుకున్నారు. ప్రయాణికులు కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, మధ్యలోనే బస్సు నిలిపి వెళ్తే గమ్యానికి ఎలా చేరాలి అని ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. డిపో నుంచి బస్సు తీసే క్రమంలో తాత్కాలిక డ్రైవర్ ఆర్‌టీసీ డీఎం సురేశ్‌బాబు కారును ఢీకొట్టాడు.
ఆర్టీసీ కార్మికులతో కలిసిరావాలి
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ కార్మికులతో కలిసి రావాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ద్రోహం చేయకుండా వారికి మద్దతుగా సమ్మెలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సలీం, బకరం శ్రీనివాస్, గురువయ్య, పందుల సైదులు, దుడుకు లక్ష్మీనారాయణ, అద్దంకి రవీందర్, ఇండ్లూరు సాగర్, దండెంపల్లి సత్తయ్య, ఐతగోని జనార్దన్‌గౌడ్, వీరా నాయక్, లింగయ్య, మానుపాటి భిక్షం, రాజు పాల్గొన్నారు.
సమ్మెను మరింత ఉధృతం చేయాలని తీర్మానం
ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. స్థానిక పీఆర్‌టీయూ భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బండారు ప్రసాద్, సీపీఎం నాయకులు పాలడుగు నాగార్జున, తుమ్మల వీరారెడ్డి, సలీం, సీపీఐ నేతలు కాంతయ్య, వీరస్వామి, టీడీపీ నాయకులు రఫీ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, న్యూ డెమోక్రసీ నేతలు ఇందూరు సాగర్, టీజేఎస్ నాయకుడు గోపాల్‌రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ తరపున పర్వతాలు, జనసేనా నుంచి మల్లేశ్, ఐఎన్‌టీయూసీ తరపున వెంకన్న, సీఐటీయూ నుంచి సత్తయ్య, టీవీవీ నుంచి పందుల సైదులు, విజయ్‌కుమార్, కాశయ్య, ఐద్వా నుంచి ప్రభావతి, మానవ హక్కుల వేదిక తరపున గురువయ్య, ఉపాధ్యాయ సంఘాల నుంచి సైదులు, బకరం శ్రీనివాస్, ప్రమీల, లింగయ్య, మానుపాటి భిక్షం, లక్ష్మీనారాయణ, జనార్దన్‌గౌడ్, రవి, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నాయకులకు కార్మిక సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కార్మికుల పక్షాన వినతి పత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత వారి నివాసాల వద్ద నిరసన కొనసాగించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment