
హామీలతో పూట గడుపుతున్న కేసీఆర్
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ పూటకో హామీతో కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర...
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్
కరీంనగర్: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ పూటకో హామీతో కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో 18 లక్షల ఇళ్లు మంజూరైతే తెలంగాణ ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫీజులు ఇంకా రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, మండలాల్లో 8 గంటలు, హైదరాబాద్‌లో 6 గంటల విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబు అడుగుజాడల్లోనే కేసీఆర్ పయనిస్తున్నారని విమర్శించారు.