సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. హరికృష్ణ చివరిచూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు చివరిసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ చితికి కళ్యాణ్‌రామ్ నిప్పంటించారు. హరికృష్ణ గౌరవార్థం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
అంతకుముందు అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర సాగింది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం మహాప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నరపాటు అంతిమయాత్ర సాగింది. ‘రథసారధి’కి అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment