‘బంగారు తల్లి’ పథకానికి 2013 నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు.
యాలాల: ‘బంగారు తల్లి’ పథకానికి 2013 నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,637 దరఖాస్తులు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. మొదటి పర్యాయంలో భాగంగా ఇచ్చే నగదు ప్రోత్సాహకానికి వీటిని కూడా కలుపుకుంటే మొత్తం రూ.65,92,500 చెల్లించాల్సి ఉంది. ఘట్‌కేసర్, షాబాద్, గండీడ్, కుల్కచర్ల, మహేశ్వరం మండలాల్లో మొదటి దశ చెల్లింపుల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇదీ పథకం..
ఈ పథకంలో భాగంగా ఆడ శిశువు జనన నమోదు సమయంలో రూ.2,500 అందజేస్తారు. ఆమెకు 21 సంవత్సరాలు నిండేవరకు (డిగ్రీ పూర్తిచేసే వరకు) రూ.లక్ష 55వేలను ప్రభుత్వం వివిధ దశల్లో అందజేస్తుంది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బాలికల కోసం ఈ పథకాన్ని 2013, మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టి చట్టబద్ధం చేశారు. ఆడ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పడే విధంగా రూపొందించిన ఈ పథకం సరిగ్గా అమలైతే అంతోఇంతో లబ్ధి చేకూరుతుంది.
కానీ అధికారుల నిర్లిప్తత కారణంగా పథకం మూలనపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. నమోదులో జరుగుతున్న తీవ్ర జాప్యం, ప్రోత్సాహకానికి నిధుల మంజూరులో నిర్లక్ష్యం కారణంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఆరు నెలలుగా ప్రోత్సాహకం అందకపోవ డంపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బ్యాంకు ఖాతా, గ్రామ సంఘం, ఏఎన్‌ఎం, ఐకేపీ కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్నా.. డబ్బులు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.