బంగారు తల్లి పథకానికి బాలారిష్టాలు దాటకముందే అడ్డంకులు మొదలయ్యాయి.
పరిగి:బంగారు తల్లి పథకానికి బాలారిష్టాలు దాటకముందే అడ్డంకులు మొదలయ్యాయి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే విషయంలో ఇప్పటికి సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో బంగారు తల్లుల్ని కన్న తల్లిదండ్రులు ఆందోళనకు గరరవుతున్నారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది కావస్తుండగా.. తొమ్మిది నెలలుగా లబ్ధిదారులకు డబ్బులు చెల్లించడం నిలిపి వేశారు.
బాలికల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భరోసా కల్పిస్తూ 2013 మేలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అమ్మాయి పుట్టింది మొదలు.. డిగ్రీ వరకు ఆమె చదువు తదితర ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టారు. పుట్టినప్పటినుంచి ఏడాదివారీ ఖర్చుల నిమితం బాలిక డిగ్రీ పూర్తి చేసే సమయానికి మొత్తం రూ. 2.16 లక్షలు అందజేయడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఇంతలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కొత్త ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
అంతేకాకుండా ఈ పథకానికి నిధుల కేటాయింపు కూడా లేకపోవడంతో ఆడపిల్లలు జన్మించిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నా.. పథకం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఆడపిల్లలని కన్నవారు ఇప్పటికీ బంగారుతల్లి పథకానికి పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ‘బంగారు తల్లి పథకం’ కింద తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి ఈ పథకంపై స్పష్టత కరువైనా అధికారులు మాత్రం బంగారు తల్లి పథకం కింద పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ఇంకా అవగాహన కరువు
బంగారు తల్లి పథకం కొనసాగుతుందా లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. దీనికితోడు ప్రజలకు కూడా ఈ పథకంపై అవగాహన కరువైంది. పథకం ప్రారంభమైన నాటినుంచి జిల్లాలో ఇప్పటి వరకు 26,362 మంది బాలికలు జన్మించారు. అయితే వారిలో 2,432 మంది మూడో కాన్పులో పుట్టడం, కుటుంబ సభ్యులు పింక్ కార్డు కలిగి ఉండటంతో వారిని ఈ పథకానికి అనర్హులుగా తేలారు. కాగా మిగిలిన 22 వేల మంది బాలికలు బంగారు తల్లి పథకానికి అర్హులైనప్పటికీ అందులో రెండొంతుల మంది కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 9685 మంది మాత్రమే బంగారు తల్లి పథకం కోసం ఐకేపీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3763 మందికి బ్యాంకుల నుంచి మొదటి ఇనిస్టాల్‌మెంట్ కింద డబ్బులు అందాయి.