అదే నిర్లక్ష్యం..! | Negligence on Ponds Development | Sakshi
Sakshi News home page

అదే నిర్లక్ష్యం..!

Published Sat, May 25 2019 7:58 AM | Last Updated on Sat, May 25 2019 12:24 PM

Negligence on Ponds Development - Sakshi

 సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో చెరువుల ప్రక్షాళనపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడటంలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులకుగాను..ప్రస్తుతానికి 19 చెరువుల ప్రక్షాళన, సుందరీకరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మిగతా చెరువులను పట్టించుకోకపోవడంతో ఆయా చెరువులు కబ్జాలపాలై కుంచించుకుపోతున్నాయి. ఘన, ద్రవ వ్యర్థాల చేరికతో కాలుస్య కాసారాలుగా మారుతున్నాయి. సమీప ప్రాంతాల ప్రజలు దోమలతో అవస్థలు పడుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని 2357 చెరువుల పరిస్థితీ ఇదే తరహాలో ఉంది. ఐదేళ్లుగా ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులు గుర్తించడంలోనూ యంత్రాంగం విఫలమౌతోంది.

గుర్తింపుపైనా నిర్లక్ష్యమే..
ఒకప్పుడు చెరువులు, కుంటలతో అలరారిన భాగ్య నగరిలో వాటి పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మొత్తం 2357 చెరువులకుగాను..ఐదేళ్లుగా ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులు గుర్తించి తుది నోటిఫికేషన్‌ జారీచేసింది కేవలం 165 చెరువులకే కావడం గమనార్హం. మిగతా చెరువుల బౌండరీలు, ఎఫ్‌టీఎల్‌ గుర్తింపు పనులు నీటిపారుదల, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ విభాగాల వద్ద వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉండడం  ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్‌(నీటి నిల్వసామర్థ్యం)సరిహద్దులను గుర్తించే పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతుండడం గమనార్హం. 

చేయాల్సింది ఇలా..
ప్రధానంగా ప్రైవేటు కన్సల్టెన్సీల సాయంతో సంబంధిత చెరువు లేదా కుంటను హెచ్‌ఎండీఏ సర్వే చేసి ప్రాథమిక నివేదికను నీటిపారుదల శాఖకు సమర్పించాలి. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యాప్‌ను సిద్ధంచేసి తిరిగి హెచ్‌ఎండీఏకు అప్పగించాలి. ఆతరువాత హెచ్‌ఎండీఏ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత రెవెన్యూ యంత్రాంగానికి పంపిస్తారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే తుది నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మొత్తం 2357 చెరువులకుగాను ఐదేళ్లుగా ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులు గుర్తించి తుది నోటిఫికేషన్‌ జారీచేసింది 165 చెరువులకు మాత్రమే కావడం గమనార్హం. మిగతా చెరువుల బౌండరీలు, ఎఫ్‌టీఎల్‌ గుర్తింపు పనులు నీటిపారుదల, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ విభాగాల వద్ద వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 

80 శాతం తగ్గిన విస్తీర్ణం..!
ఔటర్‌కు లోపల చిన్న, పెద్ద చెరువులు, కుంటల విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. ఆ తరవాత శివార్లలో రియల్‌ రంగం ఊపందుకోవడంతో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జి.ఓ.111 పరిధిలో ఉన్న గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్‌వెంచర్లు, వాణిజ్యస్థలాలు, బహుళఅంతస్థుల భవంతులు వెలిసి ఒకప్పుడు పచ్చటి పంటపొలాలు, నిండుకుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్‌ మహారణ్యంగా మారాయి. దీంతో ఆయా జలవనరుల విస్తీర్ణంగణనీయంగా తగ్గుముఖం పట్టి 5641 ఎకరాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం మేర వీటి విస్తీర్ణం తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్ననీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.  

 ప్రభుత్వ బాధ్యతలు ఇవీ..
చెరువులు, కుంటలను కబ్జాచేస్తున్న అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.
ప్రతీ జలాశయానికి ఎఫ్‌టీఎల్‌ పరిధిని గుర్తించి పటిష్ట రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. ఆయా జలాశయాల చుట్టూ పటిష్టమైన కట్టలు ఏర్పాటు చేయాలి.  
జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి.
ప్రతి జలాశయం పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటు చేయాలి.
ఇప్పటికే అక్రమార్కుల చెరువులో ఉన్న భూములను రెవెన్యూ యంత్రాంగం స్వాధీనం చేసుకోవాలి.
ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో స్థానిక ప్రజ లు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి.
స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజి (వరదనీటి కాలువల) మాస్టర్‌ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు.
మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా అన్ని చెరువులు, కుంటల పునరుద్ధరణ జరగాలి. తద్వారా వర్షపునీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి.
చెరువుల్లోకి వర్షపునీటిని చేర్చే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement