అంబర్‌పేట: ఓ బాలుని ఆకతాయితనం సొంత మేనమామకే చిక్కులు తెచ్చి పెట్టింది. సంబంధం లేని వారి చేతిలో అకారణంగా దెబ్బలు తినడమే కాకుండా పోలీసు స్టేషను గడప తొక్కాల్సి వచ్చింది. సినిమా ట్విస్ట్‌ను తలపించే ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మల్లేశ్ కథనం ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివసించే లత కుమారుడు కార్తీక్ స్థానికంగా ఓ పాఠశాలలో 3 వ తరగతి చదువుతున్నాడు. ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్న తల్లి ఆ విధుల నిమిత్తం ఉదయం బయటకు వెళ్తూ తన తమ్ముడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి కార్తీక్‌కు క్షవరం చేయించుకు రావాల్సిందిగా కోరింది. దీంతో అతను కాచిగూడలో ఉన్న సెలూన్‌కు మేనల్లుడ్ని ఆటోలో తీసుకెళ్లాడు. అనంతరం ఆటోలో అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ వరకు వచ్చిన ప్రవీణ్ , తాను వేరే పనులపై వెళ్లేందుకు... అక్కడి నుంచి కార్తీక్‌ను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా తన తమ్ముడు అశ్విన్‌ను పిలిచి అప్పగించి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో వారు నడుచుకుంటూ వెళ్తుండగా బాలుడు చిన్నమామను ఎటువైపు తీసుకెళ్తున్నావని నిలదీస్తూ ఏడుపు మొదలు పెట్టాడు. దారిలో వీరిని గమనించిన వారు ఏమైందని ప్రశ్నించడంతో అతనెవరో తనకు తెలీదని, తనను కొడుతున్నాడంటూ మామపైనే వారికి కార్తీక్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అశ్విన్ చెప్పింది వినిపించుకోకుండా అతడిని చితకబాదారు. అనంతరం అశ్విన్‌ను, బాలుడిని అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. పోలీసుల వద్దకూడా కార్తీక్ తనకు అశ్విన్ తెలియదనే చెప్పడంతో వారూ తొలుత ఆ మాటల్నే నమ్మారు. అంతే కాకుండా తన పేరు, ఫిర్యాదు సైతం రాసుకోవాలని కోరాడు దీంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో అశ్విన్ తన అన్న ప్రవీణ్‌కు ఫోన్ చేయడంతో అతను పోలీసుస్టేషన్‌కు వచ్చి అతను తన తమ్ముడేననీ, కార్తీక్ తమ అక్క కొడుకేనని చెప్పాడు. బాలుడు కూడా ప్రవీణ్‌ను చూసి తన మామ అని చెప్పడం విశేషం. చివరకు సోదరులిరువురూ తమ సోదరి లతతో పోలీసులతో మాట్లాడించడంతో కథ సుఖాంతం అయ్యింది. బాలుడ్ని పెద్దమామతో పోలీసులు పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment