
ఆన్‌లైన్‌లో దస్తావేజులను నమోదు చేస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది
సాక్షి, షాద్‌నగర్ టౌన్: భూములు, ప్లాట్ల కొనుగోలు తర్వాత డాక్యుమెంట్లు చేతికి రావాలంటే ఇప్పటివరకు కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. దళారులను ఆశ్రయించి ఎంతోకొంత డబ్బు ఇస్తేనే అవి అందేవి. ఈ ఇబ్బందులు ఇక తప్పనున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్‌నంబర్‌కు ఓటీపీ వచ్చే విధంగా చర్యలు చేపట్టింది. వన్‌టైం పాస్‌వర్డ్ నంబర్ చెబితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్లను అందిస్తున్నారు.
ఇక రశీదులు లేవ్..
రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు పూర్తయిన తర్వాత డాక్యుమెంట్‌ను తీసుకునేందుకు గతంలో రశీదు ఇచ్చేవారు. అయితే, దళారులు కార్యాలయ సిబ్బందితో కుమ్మకైసదరు పత్రాలను నేరుగా కొనుగోలుదారులకు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించేవారు. అదేవిధంగా దళారులు, దస్తావేజు లేఖరులు కార్యాలయం నుంచి డాక్యుమెంట్లను తీసుకొని తమవద్ద ఉంచుకొని కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెట్టేవారు. దీంతో పత్రాలు చేతికి రావాలంటే కొనుగోలుదారులు వారి చేతులు తడపాల్సిందే. దీనిని గుర్తించిన రిజిస్ట్రేషన్ శాఖ రశీదు విధానానికి స్వస్తి పలికింది.
రిజిస్ట్రేషన్ సేవలకు వర్తింపు
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వివిధ రకాల సేవలను సబ్‌రిజిస్ట్రార్లు అందిస్తున్నారు. కొనుగోలు, అమ్మకం దస్తావేజులు, దాన సెటిల్‌మెంట్, ఆస్తిహక్కు విడుదల, జీపీఏ, ఏజీపీఏ, సవరణ, వీలునామా, భాగ పరిష్కారం, తనఖా, తనఖా ఆస్తిహక్కు విడుదల తదితరాలకు నూతన సంస్కరణలు అమలు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆస్తికి సంబంధించి కొనుగోలు, అమ్మకందారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు విధిగా కొనుగోలుదారు తమ సెల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. డాక్యుమెంట్ సిద్ధమైన తర్వాత కొనుగోలుదారుడి సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
కొనుగోలుదారులకు ఆన్‌లైన్‌లో దస్తావేజులను డౌన్‌లోడ్ చేసుకునే వీలును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కల్పించింది. స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో సెల్‌నంబర్‌తోపాటు సెక్యూరిటీ కోడ్ నమోదు చేస్తే సర్టిఫై చేసిన డాక్యుమెంట్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
రైతుల్లో అవగాహన కరువు
గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు ఆన్‌లైన్ విధానం గురించి అవగాహన లేదు. రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన సంస్కరణలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి దస్తావేజు సిద్ధమైన తర్వాత వారి ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అయితే, ఫోన్‌నంబర్‌కు ఓటీపీ వస్తుందనే విషయం రైతుల్లో సరైన అవగాహన రాలేదు. దీంతో చాలామంది మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఓటీపీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
సెల్‌ఫోన్‌కు ఓటీపీ నంబర్..
స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లు పొందేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లు కార్యాలయంలో సిద్ధం కాగానే కొనుగోలుదారుడు పొందుపర్చిన సెల్‌ఫోన్ నంబర్‌కు ఓటీపీ (వన్ టైం పాస్ వర్డ్) వస్తుంది. ఆ తర్వాత కొనుగోలుదారులు సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఓటీపీ నంబర్ చెప్పి అధికారుల నుంచి నేరుగా డాక్యుమెంట్లను తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారం రోజుల లోపు కొనుగోలుదారులు ఓటీపీ నంబర్ చెప్పి పత్రాలు తీసుకోవచ్చు. ఈ విధానం ఇటీవలే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పారదర్శకంగా సేవలు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనేక సంస్కరణలు చేపడుతోంది. డాక్యుమెంట్లను తీసుకునేందుకు ఓటీపీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కార్యాలయంలో దస్తావేజులు స్కానింగ్ పూర్తయిన తర్వాత స్థిరాస్థి కొనుగోలుదారుల ఫోన్‌నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ చెబితే నేరుగా వారికే పత్రాలను అందజేస్తున్నాం. రైతులు ఓటీపీపై అవగాహన పెంచుకోవాలి.
– సతీష్‌కుమార్, సబ్‌రిజిస్ట్రార్, ఫరూఖ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment