రూ.50 కోట్లతో కొత్త బస్సులు
► రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో త్వరలో రూ. 50 కోట్ల వ్యయంతో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరగని ప్రాంతాలు ఉండరాదని ఆయన అధికారులను ఆదేశించారు. హకీంపేటలో శుక్రవారం ఆర్టీసీ ఈడీలు, ఆర్‌ఎంలు, హైదరాబాద్ జోన్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. రవాణా శాఖ కమిషనర్ సునీల్‌శర్మ, ఆర్టీసీ జేఎండీ రమణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్‌లోని రెండు రీజియన్ల పరిధిలో ఉన్న 28 డిపోల స్థితిగతులను మంత్రి మహేందర్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అన్ని డిపోలు కోట్ల రూపాయల నష్టంలో కూరుకుపోవడంపై అధికారులను నిలదీశారు. డీఎంలు, ఆర్‌ఎంల పనితీరు పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు.
పెరిగిన వేతనాలు, రెగ్యులరైజేషన్‌తో భారం, నష్టం పెరిగిందని అధికారులు చెప్పగా... ఈ వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను పెంచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శివారు ప్రాంతాల డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని చెప్పారు. ఇక ఫరూక్‌నగర్, ముషీరాబాద్-3 డిపోల నిర్మాణాలను త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. జనవరి నాటికి ఆర్టీసీ రూ. 289 కోట్ల నష్టాల్లో ఉందని, దాన్ని తగ్గించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. నష్టాలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జోన్‌ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని జేఎండీని ఆదేశించారు. గత ఏడాది కన్నా నష్టం పెరగడంపై ఆర్‌ఎంలను ఆరా తీశారు. కొత్త డిపోల ఆలోచన లేకున్నా, ఉన్న వాటిని సరిగ్గా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.