సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యపై సైబరాబాద్ కమిషనరేట్‌లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, సైబరాబాద్ సీపీ సజ్జన్నార్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విడతలవారీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బయటకు రావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఐటీ ప్రతినిధులు అంగీకరించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు.
వర్షం పడినప్పుడు ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో ఉద్యోగులను ఇళ్లకు పంపడానికి ఐటీ కంపెనీలు ఒప్పుకున్నాయని, ఆయా కంపెనీల పనివేళలకు నష్టం కలుగకుండా ఉద్యోగులను బయటకు పంపనున్నాయని ఆయన వివరించారు. ట్రాఫిక్ విభాగం నుంచి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీపీ సజ్జన్నార్ తెలిపారు. 24 గంటల ముందే వర్షాలకు సంబంధించి హెచ్చరికలు జారీచేస్తామని, ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో రద్దీ గురించి అలర్ట్ చేస్తారని తెలిపారు. విడుతలవారీగా ఐటీ ఉద్యోగులు కంపెనీల నుంచి బయటకు రావడం వల్ల పెద్దగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. ఐటీ కారిడార్‌లో ఇప్పుడు 5 లక్షలు మంది ఉద్యోగులు ఉన్నారని, ఒకేసారి మూడున్నర లక్షల కార్లు బయటకు వస్తుండటంతో రోడ్లు అన్ని ట్రాఫిక్ స్తంభించిపోతున్నాయని, అందుకే ఈ మేరకు పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment