నిర్మల్ కలెక్టరేట్ ఆస్తులు జప్తు
కుర్చీలు, కంప్యూటర్లను తీసుకెళ్లిన కోర్టు సిబ్బంది
నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను శుక్రవారం కోర్టు సిబ్బంది జప్తు చేశారు. భూసేకరణకు సంబంధించిన కేసులో నిర్మల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో మండలంలోని బామ్ని(బి) గ్రామంలో 2004లో ఊరచెరువు నిర్మాణంలో 20 మందికి పైగా రైతులు భూములు కోల్పోయారు. ఏళ్లు గడిచినా పరిహారం అందకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును పరిశీలించిన జడ్జి సంతోష్‌కుమార్ రూ.12 లక్షల 84వేల 970 విలువైన కలెక్టరేట్ ఆస్తులను కోర్టుకు అటాచ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కోర్టు సిబ్బంది శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చైర్‌తో సహా మిగితా సెక్షన్లలోని కుర్చీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్సు మెషిన్లను తీసుకెళ్లారు. కలెక్టర్ వాహనం అందుబాటులో లేకపోవడంతో అయా సామగ్రి జప్తు చేసినట్లు సిబ్బంది పేర్కొన్నారు.
కుర్చీల్లేక.. నిల్చొనే..
కోర్టు సిబ్బంది కార్యాలయంలోని కుర్చీలు, కంప్యూటర్లను కోర్టు సిబ్బంది జప్తు చేయడంతో కలెక్టరేట్ సిబ్బంది ఆయోమయంలో పడ్డారు. చాలా సేపు నిల్చునే ఉన్నారు. అప్పటికే లంచ్ టైం కావడంతో ఉద్యోగులు, సిబ్బంది బయ టకు వెళ్లిపోయారు. అనంతరం వచ్చిన సిబ్బందిలో కొందరు అక్కడక్కడ ఉన్న పాత కుర్చీలలో సర్దుకున్నారు. మిగితా వారు నిల్చొనే ఉండాల్సి వచ్చింది.