నిజాం షుగర్స్‌కు రూ.13.80 కోట్లు
* 3 ఫ్యాక్టరీలకు నిధులు మంజూరు చేసిన సర్కారు
* మంబోజిపల్లి రైతుల బకాయిలకు త్వరలో మోక్షం
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని మూడు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలలో చెరకు రైతులకు చెల్లించేందుకు రూ.13.80 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలోని మంబోజిపల్లి, నిజామాబాద్ జిల్లా షక్కర్‌నగర్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల్లో 2014-15 క్రషింగ్ సీజన్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం ఈ నిధులు మంజూరు చేసింది.
అయితే ఏ ఫ్యాక్టరీకి ఎన్ని నిధులు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. మూడు చక్కెర ఫ్యాకర్టీల్లో రైతులకు సుమారు రూ.27.50 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 13.80 కోట్లు మంజూరు కాగా, మిగతా నిధులు మరో విడతలో ఇచ్చే అవకాశం ఉంది.
మంబోజిపల్లి చెరకు రైతుకు ఊరట!
మెదక్ సమీపంలోని మంబోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్స్ చెరకు రైతులకు సుమారు రూ.6.60 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాల్సిందిగా రైతులు చాలా కాలంగా కోరుతున్నారు. తాజాగా చెరకు బకాయి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో మంబోజిపల్లి రైతులకు బకాయిలు త్వరలో చెల్లించే అవకాశం ఉంది. మూడు చక్కెర ఫ్యాక్టరీలకు సమానంగా నిధులు కేటాయించిన పక్షంలో మంబోజిపల్లి ఫ్యాక్టరీ వాటాగా రూ.4.6 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చెరకు రైతులకు కొంత ఊరట లభించనుంది.