సాక్షి, నిజామాబాద్ అర్బన్: కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. మోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (40) ఉపాధి కోసం సౌదీకి వెళ్లి, పది రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఆయన.. స్వగ్రామానికి వచ్చినప్పటి నుంచి తీవ్ర జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నాడు. నాలుగు రోజులుగా ఆర్‌ఎంపీ వద్ద చూయించుకున్నా తగ్గలేదు. దీంతో సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షించిన వైద్యుడు కరోనా లక్షణాలున్నాయని అనుమానించి గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు.
మరోవైపు, సదరు వ్యక్తికి చికిత్స అందించిన గదిలో కెమికల్స్ చల్లి, ఆ రూంను సీజ్ చేసినట్లు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో తాము హైదరాబాద్‌కు రిఫర్ చేశామని పేర్కొన్నారు. సౌదీ నుంచి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేశారని, కాని ఇంటికి వచ్చినప్పటి నుంచి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నట్లు సదరు వ్యక్తి చెప్పాడని, దీంతో గాంధీకి పంపించామని వివరించారు. మరోవైపు, ఈ విషయంపై డీఎంహెచ్‌వో సుదర్శనంను ‘సాక్షి’ సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. (‘వైరస్’ మోసుకొస్తున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment