ఉట్టి ముచ్చటే..!
► నకిలీ విత్తన నిరోధక చట్టంబిల్లుకు మొండిచేయి
► శాసనసభ సమావేశంలో పట్టించుకోని సీఎం కేసీఆర్
► రైతులపై ప్రయోగాలు చేస్తున్న కంపెనీలు
► అన్నదాతలను మోసం చేస్తున్న వ్యాపారులు
► జిల్లాలో ఈ ఏడాది రెండుసార్లు మోసపోయిన కర్షకులు
సాక్షి, వరంగల్ రూరల్: నకిలీ విత్తన కంపెనీల ప్రయోగాలతో అన్నదాతలు ఏటా నష్టపోతూనే ఉన్నారు. వ్యాపారులు సైతం ఆయా కంపెనీలతో కుమ్మక్కై, ఇతర రూపాల్లో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవ హరి స్తున్నారు. నకిలీ విత్తనాలతో పంటలను సాగుచేసి నష్టపోయిన సమయంలో పరిహారం ఇప్పించే చట్టం లేకపోవడంతో వారు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు.
కొన్ని సందర్భాల్లో మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే నకిలీ విత్తన నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తామని ఏడాది కాలంగా సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నా ఫలితం లేకుండాపోయింది. గత ఏప్రిల్ 30వ తేదీన భూసేకరణ చట్టసవరణ బిల్లుతో పాటు నకిలీ విత్తన నిరోధక బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెడుతామని వారు చెప్పినా అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చట్టం లేకపోవడంతో మోసాలు
నకిలీ విత్తనాల నిరోధానికి, బాధిత రైతులకు పరిహారం అందించేందుకు ప్రత్యేక చట్టం లేకపోవడంతో మోసాగాళ్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. గత ఆగస్టులో జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, దుగ్గొండి మండలాలకు చెందిన సుమారు 900 మంది రైతులు నకిలీ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు. అయితే సదరు విత్తనాలు విక్రయించిన బాధ్యులపై తూతూ మంత్రంగా కేసులు పెట్టడంతో వారు మళ్లీ బయట దర్జాగా తిరుగుతున్నారు.
కాగా, చెన్నారావుపేట మండలంలోని కోనాపురం, జల్లి, ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన రైతులు జీవా మిర్చి విత్తనాలు సాగుచేశారు. అవి ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో దారుణంగా నష్టపోయారు. దీనిపై బాధితులు 300 మంది గత డిసెంబరు 24న నర్సంపేటలో విత్తన దుకాణాల ఎదుట ఆందోళన నిర్వహించినా నేటికి వారికి పరిహారం అందలేదు.
చట్టం లేకపోవడంతో కంపెనీల ఇష్టారాజ్యం
నకిలీ విత్తన నిరోధకంపై ప్రత్యేక చట్టం లేకపోవడంతో పలు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నాయి. నకిలీ విత్తన సమస్యను అరికట్టాలంటే ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేయాలి. ఇలాంటి విత్తనాలను ఉత్పత్తి చేసినా, అమ్మినా వారిని కఠినంగా శిక్షించాలి. –పసుల భిక్షపతి, నాగారం(పరకాల)
ప్రత్యేకచట్టం తీసుకురావాలి
నకిలీ విత్తన నిర్మూలనతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ యాక్టు నమోదు చేయాలి. అప్పుడే రైతులకు భరోసా ఉంటుంది. –కోడెపాక సమ్మయ్య, మల్లక్కపేట (పరకాల)
చట్టం వస్తేనే భరోసా
నకిలీ విత్తన నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకొస్తేనే వ్యవసాయంపై రైతులకు భరోసా ఉంటుంది. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం లేకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోతున్నారు. నకిలీ విత్తన నిరోధక చట్టం త్వరగా తీసుకురావాలి. –ఆళ్ల అమరలింగస్వామి, గాంధీనగర్, (సంగెం)