ఖమ్మం : ఉన్నత విద్యనభ్యసించాలనే ఆలోచనతో రేయింబవళ్లు కష్టపడి అర్హత పరీక్షలు రాస్తే .. ఫలితాలు వచ్చి నెల గడుస్తున్నా కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్, కళాశాలల్లో సీట్ల కేటాయింపు తదితర విషయాలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యం జరుగుతోంది. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించేదెప్పుడో..? తాము కళాశాలలకు వెళ్లేదెప్పుడో..? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
50 వేల మంది నిరీక్షణ..
వివిధ రకాల కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన సుమారు 50 వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మే 21న జరిగిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు 6,168 మంది, 22న జరిగిన ఎంసెట్ పరీక్షలకు 14,458 మంది, 23న జరిగిన ఐసెట్‌కు 4,136 మంది, 30న జరిగిన ఎడ్‌సెట్‌కు 8,903 మంది, జూన్ 15న జరిగిన డైట్ సెట్‌కు 18,040 మంది విద్యార్థులతోపాటు, భాషా పండితుల పరీక్షలు, ఎసీఆర్‌జేసీ, ఎసీఆర్‌డీసీ మొదలైన ప్రవేశపరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో సుమారు 50 వేల మంది అర్హత సాధించారు.
ఏ కోర్సులో చేరలేక ఆందోళన...
అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కులతో ఏ కోర్సులో సీటు వస్తుందో.. ఎక్కడ వస్తుందో.. తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో రెగ్యులర్ కోర్సుల్లో చేరక.. వృత్తి విద్యాకోర్సుల్లో సీటు వస్తుందో రాదో తేలక సంకట స్థితిలో ఉన్నారు. పాలిటెక్నిక్ రాసిన విద్యార్థి మంచి కోర్సు, అనువైన కళాశాలలో సీటు వస్తేనే చదివే అవకాశం ఉంది. లేక పోతే ఇంటర్‌లో చేరుతారు.
అయితే కౌన్సెలింగ్ జాప్యంతో అటు పాలికెక్నిక్‌లో, ఇటు ఇంటర్‌లో చేరలేక పోతున్నాడు. ఒక వేళ అనుకూలమైన సీటు రాకపోతే ఇన్ని రోజుల ఇంటర్ క్లాస్‌లు నష్టపోవాల్సి వస్తుంది. డైట్‌సెట్ రాసిన విద్యార్థులకు సీటు వస్తుందో.. రాదో.. తెల్చుకోలేని పరిస్థితి నెల కొంది. మార్కుల జాబితాను ప్రకటించిన అధికారులు ర్యాంకులు ప్రకటించకపోవడంతో తమకు వచ్చిన మార్కులకు సీటు వస్తుదా..?లేదా.. డిగ్రీలో చేరాలా అని తేల్చుకోలేకపోతున్నారు.
ఇక ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. లోకల్, నాన్‌లోక్, పీజు రీయింబర్స్‌మెంట్ ఇతర విషయాలపై ప్రభుత్వం లెక్కలు వేస్తూ కాలయాపన చేస్తోంది. దీనిని గమనించిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెన్నై, రాజస్థాన్, బెంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో లక్షల రూపాయలు చెల్లించి తమ పిల్లలను పంపిస్తున్నారు. ఇలా ఒక్క మన జిల్లా నుంచే ఈ ఏడాది సుమారు వెయ్యిమంది విద్యార్థులు వెళ్ళినట్లు సమాచారం.
ఆదాయ సర్టిఫికెట్ నిలిపివేతతో మరింత జాప్యం..
ఆదాయ సర్టిఫికెట్ల జారీని నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేయడంతో కౌన్సెలింగ్ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. 1956కు పూర్వం తెలంగాణలో ఉన్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని, దీనిని ఎలా లెక్కించాలోనని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదాయ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని తహశీల్దార్లను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని సర్టిఫికెట్లు ఉంటేనే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. కౌన్సెలింగ్ తేదీ ప్రకటించినా ఆదాయ సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగితే ఇబ్బందేనని విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు.
ఎదురుచూపులు ఎన్నాళ్లో ?
Published Sat, Jul 19 2014 2:58 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement