ఎట్టకేలకు కౌన్సెలింగ్..
ఖమ్మం: గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎంసెట్ విద్యార్థులకు ఊరట కలిగింది. ఎంసెట్ నిర్వహణకు మార్గం సుగమం చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్లు పరిశీస్తామని, ఈ లోపు ఇతర విషయాలపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి.
అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఒక పరిస్థితి ఉంటే.. ఖమ్మం జిల్లాకు మరో పరిస్థితి నెలకొనడంతో మార్గదర్శకాలు ఎలా ఉంటాయో.. అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎలాంటి ఆంక్షలు ఉంటాయోననేది చర్చనీయాంశంగా మారింది.
మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..?
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని ఉన్నవిద్యాఖ అధికారులు ప్రకటించినా.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉంటోయో.. ? అన్నదానిపై జిల్లా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మే 22న జరిగిన ఎంసెట్‌కు 14,458 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరితోపాటు హైదరాబాద్, విజయవాడ, వరంగల్ ప్రాంతాల్లో చదువుతున్న జిల్లా విద్యార్థులు కూడా ఆయా ప్రాంతాల్లో ప్రవేశ పరీక్షలు రాశారు.
ఇందులో సుమారు 10 వేల పైచిలుకు విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ తదితర విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించారు. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన ప్రభుత్వం.. నూతన రాష్ట్ర ఆవిర్భావం, విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, సీట్ల కేటాయింపుపై కసరత్తు ప్రారంభించింది. దీంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.
ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అయితే ఆంధ్రకు సరిహద్దులో ఉన్న మన జిల్లా విద్యార్థులు మార్గదర్శకాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. 1956కు పూర్వం స్థానికత, పోలవరం ముంపు ప్రాంతాల విద్యార్థులకు ఏ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది.. ఎక్కడ చదివితే లాభం, సీట్ల కేటాయింపులో స్థానికతకు ప్రాధాన్యత మొదలైన అంశాలతో వారి భవితవ్యం ముడిపడి ఉంది.
జిల్లాలో ప్రత్యేక పరిస్థితి...
జిల్లాలో ప్రతి సంవత్సరంనిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మన విద్యార్థులతోపాటు, పరిసర ప్రాంతాలైన వరంగల్ జిల్లా మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, కురవి, నల్గొండ జిల్లా కోదాడ, సూర్యాపేట, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇక జిల్లాలో ఉన్న 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో 9 వేల సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా చేరుతారు.
అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి నిర్ణయానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయో, సుప్రింకోర్టు ఆదేశాలు ఎలా ఉంటోయోననే చర్చ జరుగుతోంది. ముంపు ప్రాంత విద్యార్థులకు ఏ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి, తెలంగాణలో చదివే విద్యార్థులకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తుందా..? అసలు ఏపీ విద్యార్థులను తెలంగాణ ఇంనీరింగ్ కళాశాల యాజమాన్యాలు చేర్చుకుంటాయా.. ? అనేది సందిగ్దంగా మారింది.
దీనికి తోడు 1956 స్థానికత నిబంధన పెడితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత అత్యధికంగా స్థానికేతరులు ఉన్న జాబితాలో ఖమ్మం జిల్లా ఉంది. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోని విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి.