Eligibility tests
-
కీలక పరీక్షలకు ఖరారు కాని తేదీలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తున్నప్పటికీ పలు రకాల కొలువులకు అర్హత పరీక్షల తేదీలను ఖరారు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా పరీక్ష తేదీలు ఖరారు చేయకపోవడంతో ఆశావహులంతా అయోమయంలో ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో రద్దయిన పరీక్షల నిర్వహణ వాయిదాపడుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రకటించిన తేదీల్లో మార్పులు అనివార్యం కావడంతో... మరిన్ని పరీక్షల తేదీలు ఇప్పటికీ ఖరారు కాలేదు. ఫలితంగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 10 లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తున్నారు. రద్దు, వాయిదాలతో గందరగోళం ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసి, కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. దీంతో అభ్యర్థులంతా తీవ్ర అయోమయంలో ఉండిపోయారు. ఈ క్రమంలో ముందుగా రద్దయిన పరీక్షలను నిర్వహిస్తూ... ఆ తర్వాత రీషెడ్యూల్ చేసిన పరీక్షలను టీఎస్పీఎస్సీ క్రమంగా నిర్వహిస్తూ వచ్చింది. అయినా రద్దయిన డీఏఓ (డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్) పరీక్ష రీషెడ్యూల్ తేదీని ఖరారు చేయలేదు. దీంతోపాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూఓ), గ్రూప్–3 పరీక్షల తేదీలనూ కమిషన్ ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్‌లోపు నిర్వహిస్తేనే... సాధారణంగా పరీక్ష తేదీ ప్రకటనకు కనీసం నెలన్నర సమయం తీసుకుంటున్న కమిషన్... డీఏఓ, గ్రూప్–3, హెచ్‌డబ్ల్యూఓ ఉద్యోగ అర్హత పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు ఏ క్షణంలో అయినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. గత ఎన్నికలు జరిగిన తీరును పరిశీలిస్తే ఈసారి డిసెంబర్ మొదటివారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన నవంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆలోపు పరీక్షలు నిర్వహించాలని, ఎన్నికల సమయంలో అధికారులంతా ఎలక్షన్ డ్యూటీలతో బిజీగా ఉంటే పరీక్షల నిర్వహణ కష్టమనే అభిప్రాయం వస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌లోపే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఒకేరోజు మూడు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఎన్నో ఆశలతో సన్నద్ధమైన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నెల 26వ తేదీన జరిగే పరీక్షలను చూస్తే రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకే పరిమితమవాల్సిన పరిస్థితి నెలకొంది. 26న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీఏఓ (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. 53 డీఏఓ ఉద్యోగ ఖాళీల భర్తీకి దాదాపు పదిహేనేళ్ల తర్వాత ప్రకటన వెలువడింది. ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న ఈ పోస్టులు అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షను ఈనెల 26వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో పెట్టనుంది. అయితే అదే రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్ (పీఆర్టీ) ఉద్యోగ అర్హత పరీక్ష ఉండగా.. అదే రోజున స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్–2 పరీక్షను సైతం నిర్వహిస్తోంది. సాధారణంగా ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్రీయ నియామక సంస్థలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర స్థాయి ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగరంగ నిపుణులు చెపుతున్నారు. ఒకవేళ ముందస్తుగా రాష్ట్ర నియామక సంస్థలు పరీక్షల తేదీలను ప్రకటిస్తే.. అవసరమైన పక్షంలో అభ్యర్థుల ప్రయోజనాల రీత్యా వాటిని మార్పు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న జరిగే డీఏఓ, పీఆర్టీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డీఏఓ పరీక్ష తేదీలో మార్పు చేయాలని కోరుతున్నారు. ఏ పరీక్ష రాయాలో అర్థం కావడంలేదు... డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగంతో పాటు కేంద్రీయ విద్యాలయాల్లో పీఆర్టీ ఉద్యోగ పరీక్షకు సన్నద్ధమవుతున్నాను. కానీ ఈ రెండు పరీక్షలు ఒకే రోజున ఉన్నాయి. రెండింటికీ కష్టపడి చదివాను. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో ఏ పరీక్షను వదులుకోవాలో అర్థం కావడం లేదు. – జె.తేజస్విని, డీఏఓ, పీఆర్టీ అభ్యర్థి ఒక అవకాశం దెబ్బతిన్నట్టే.. దాదాపు ఆర్నెళ్లుగా డీఏఓ, పీఆర్టీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. ఇందుకోసం అశోక్‌నగర్‌లో ప్రత్యేకంగా ఫీజు చెల్లించి కోచింగ్ తీసుకుంటున్నాను. కానీ ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో నేను ఒక అవకాశాన్ని వదులుకోవాలి. నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంవల్ల అభ్యర్థుల అవకాశాలు దెబ్బతినడంఎంతవరకు సమంజసం. –పరిమళ, డీఏఓ, పీఆర్టీ అభ్యర్థి టీఎస్పీఎస్సీ పరీక్ష తేదీలను మార్పు చేయాలి కేంద్ర నియామక సంస్థలు పరీక్షలు నిర్వహించే రోజున రాష్ట్ర స్థాయి నియామక సంస్థలు ఆయా ఉద్యోగాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దు. ఒక వేళ ఒకే రోజు కేంద్ర, రాష్ట్ర స్థాయి పరీక్షలు ఉంటే టీఎస్పీఎస్సీ తేదీల్లో మార్పులు చేయాలి. 14 సంవత్సరాల తర్వాత డీఏఓ ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఇలాంటి అవకాశాలను అభ్యర్థులు నష్టపోకుండా టీఎస్పీఎస్సీ తక్షణ చర్యలు చేపట్టాలి. లేకుంటే అభ్యర్థులతో కలసి ఆందోళన చేస్తాం. –ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం -
నేడు అంబేడ్కర్ ఓయూ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష
ఏలూరు (ఆర్ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష ఈనెల 8న నిర్వహించనున్నట్టు సీఆర్ రెడ్డి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎన్వీవీఎస్ ప్రసాద్, యూనివర్సిటీ సమన్వయాధికారి జి.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతుందన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఏఓయూ.ఏసీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా పొందాలని సూచించారు. భీమవరం, తణుకు, నల్లజర్ల సెంటర్ల విద్యార్థులకూ ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
ఆ 30వేల మంది ఇంజినీర్లకు అర్హత పరీక్ష
న్యూఢిల్లీ: డీమ్డ్ వర్సిటీల్లో దూరవిద్యలో ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారంతా తిరిగి తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది. జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (రాజస్తాన్), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు వినాయక మిషన్ రీసెర్చి ఫౌండేషన్ (తమిళనాడు) దూరవిద్య విధానం ద్వారా 30వేల మందికి ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశాయి. అయితే, ఈ పట్టాలు చెల్లవంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరిగే ఈ పరీక్ష రాయాలనుకునే వారు జనవరి 15లోగా పేర్లను నమోదు చేయించుకోవాలని కోరింది. ఇందులో పాసైన వారికే ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేస్తామని పేర్కొంది. -
ఎదురుచూపులు ఎన్నాళ్లో ?
ఖమ్మం : ఉన్నత విద్యనభ్యసించాలనే ఆలోచనతో రేయింబవళ్లు కష్టపడి అర్హత పరీక్షలు రాస్తే .. ఫలితాలు వచ్చి నెల గడుస్తున్నా కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్, కళాశాలల్లో సీట్ల కేటాయింపు తదితర విషయాలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యం జరుగుతోంది. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించేదెప్పుడో..? తాము కళాశాలలకు వెళ్లేదెప్పుడో..? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 50 వేల మంది నిరీక్షణ.. వివిధ రకాల కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన సుమారు 50 వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మే 21న జరిగిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు 6,168 మంది, 22న జరిగిన ఎంసెట్ పరీక్షలకు 14,458 మంది, 23న జరిగిన ఐసెట్‌కు 4,136 మంది, 30న జరిగిన ఎడ్‌సెట్‌కు 8,903 మంది, జూన్ 15న జరిగిన డైట్ సెట్‌కు 18,040 మంది విద్యార్థులతోపాటు, భాషా పండితుల పరీక్షలు, ఎసీఆర్జేసీ, ఎసీఆర్డీసీ మొదలైన ప్రవేశపరీక్షలకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో సుమారు 50 వేల మంది అర్హత సాధించారు. ఏ కోర్సులో చేరలేక ఆందోళన... అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కులతో ఏ కోర్సులో సీటు వస్తుందో.. ఎక్కడ వస్తుందో.. తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో రెగ్యులర్ కోర్సుల్లో చేరక.. వృత్తి విద్యాకోర్సుల్లో సీటు వస్తుందో రాదో తేలక సంకట స్థితిలో ఉన్నారు. పాలిటెక్నిక్ రాసిన విద్యార్థి మంచి కోర్సు, అనువైన కళాశాలలో సీటు వస్తేనే చదివే అవకాశం ఉంది. లేక పోతే ఇంటర్లో చేరుతారు. అయితే కౌన్సెలింగ్ జాప్యంతో అటు పాలికెక్నిక్లో, ఇటు ఇంటర్లో చేరలేక పోతున్నాడు. ఒక వేళ అనుకూలమైన సీటు రాకపోతే ఇన్ని రోజుల ఇంటర్ క్లాస్‌లు నష్టపోవాల్సి వస్తుంది. డైట్‌సెట్ రాసిన విద్యార్థులకు సీటు వస్తుందో.. రాదో.. తెల్చుకోలేని పరిస్థితి నెల కొంది. మార్కుల జాబితాను ప్రకటించిన అధికారులు ర్యాంకులు ప్రకటించకపోవడంతో తమకు వచ్చిన మార్కులకు సీటు వస్తుదా..?లేదా.. డిగ్రీలో చేరాలా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇక ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. లోకల్, నాన్‌లోక్, పీజు రీయింబర్స్మెంట్ ఇతర విషయాలపై ప్రభుత్వం లెక్కలు వేస్తూ కాలయాపన చేస్తోంది. దీనిని గమనించిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెన్నై, రాజస్థాన్, బెంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో లక్షల రూపాయలు చెల్లించి తమ పిల్లలను పంపిస్తున్నారు. ఇలా ఒక్క మన జిల్లా నుంచే ఈ ఏడాది సుమారు వెయ్యిమంది విద్యార్థులు వెళ్ళినట్లు సమాచారం. ఆదాయ సర్టిఫికెట్ నిలిపివేతతో మరింత జాప్యం.. ఆదాయ సర్టిఫికెట్ల జారీని నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేయడంతో కౌన్సెలింగ్ మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. 1956కు పూర్వం తెలంగాణలో ఉన్న వారికే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని, దీనిని ఎలా లెక్కించాలోనని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదాయ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని తహశీల్దార్లను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని సర్టిఫికెట్లు ఉంటేనే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. కౌన్సెలింగ్ తేదీ ప్రకటించినా ఆదాయ సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగితే ఇబ్బందేనని విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు.