కీలక పరీక్షలకు ఖరారు కాని తేదీలు | Unfinalized dates for key exams | Sakshi
Sakshi News home page

కీలక పరీక్షలకు ఖరారు కాని తేదీలు

Published Thu, Aug 10 2023 3:51 AM | Last Updated on Thu, Aug 10 2023 3:51 AM

Unfinalized dates for key exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తున్నప్పటికీ పలు రకాల కొలువులకు అర్హత పరీక్షల తేదీలను ఖరారు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ద్వారా విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా పరీక్ష తేదీలు ఖరారు చేయకపోవడంతో ఆశావహులంతా అయోమయంలో ఉన్నారు.

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో రద్దయిన పరీక్షల నిర్వహణ వాయిదాపడుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రకటించిన తేదీల్లో మార్పులు అనివార్యం కావడంతో... మరిన్ని పరీక్షల తేదీలు ఇప్పటికీ ఖరారు కాలేదు. ఫలితంగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 10 లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తున్నారు. 

రద్దు, వాయిదాలతో గందరగోళం 
ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసి, కొన్నింటిని రీషెడ్యూల్‌ చేసింది. దీంతో అభ్యర్థులంతా తీవ్ర అయోమయంలో ఉండిపోయారు. ఈ క్రమంలో ముందుగా రద్దయిన పరీక్షలను నిర్వహిస్తూ... ఆ తర్వాత రీషెడ్యూల్‌ చేసిన పరీక్షలను టీఎస్‌పీఎస్సీ క్రమంగా నిర్వహిస్తూ వచ్చింది. అయినా రద్దయిన డీఏఓ (డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) పరీక్ష రీషెడ్యూల్‌ తేదీని ఖరారు చేయలేదు. దీంతోపాటు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (హెచ్‌డబ్ల్యూఓ), గ్రూప్‌–3 పరీక్షల తేదీలనూ కమిషన్‌ ప్రకటించలేదు. 

ఎన్నికల షెడ్యూల్‌లోపు నిర్వహిస్తేనే... 
సాధారణంగా పరీక్ష తేదీ ప్రకటనకు కనీసం నెలన్నర సమయం తీసుకుంటున్న కమిషన్‌... డీఏఓ, గ్రూప్‌–3, హెచ్‌డబ్ల్యూఓ ఉద్యోగ అర్హత పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు ఏ క్షణంలో అయినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది.

గత ఎన్నికలు జరిగిన తీరును పరిశీలిస్తే ఈసారి డిసెంబర్‌ మొదటివారం నాటికి ఎన్నికలు పూర్తి చేయా­ల్సి ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన నవంబర్‌లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆలోపు పరీక్షలు నిర్వహించాలని, ఎన్నికల సమయంలో అధికారులంతా ఎలక్షన్‌ డ్యూటీలతో బిజీగా ఉంటే పరీక్షల నిర్వహణ కష్టమనే అభిప్రాయం వస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌లోపే పరీక్షలు నిర్వహించి ఫలితా­లు ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement