
బాన్సువాడ ఉన్నత పాఠశాలలో నో సిగ్నల్ అని చూపుతున్న టీవీ
బాన్సువాడటౌన్ నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు డీలా పడిపోయాయి. ప్రభుత్వ పాఠాశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన నిర్వహించాలని ప్రభుత్వం 2016 నవంబర్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో, బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2016 నవంబర్ 17న ప్రారంభించారు.
మొదట విడత కింద ఉన్నత, కేజీవీబీలు, మోడల్‌స్కూల్‌లలో డిజిటల్ పాఠాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించాలని ఏర్పాటు చేసిన డిజిటల్ పాఠాల బోధన ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. డిజిటల్ బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగుపర్చవచ్చని ప్రభుత్వ భావించింది.
హింది, వ్యాయామ టీచర్లు మినహా మిగత ఉపాధ్యాయులకు గతంలో శిక్షణ కూడా ఇచ్చారు. సుమారు 650 పాఠాలు కలిగిన హర్డ్‌డిస్క్‌లను పాఠశాలలకు అందజేశారు. హర్డ్‌డిస్కులు సరిపోను పాఠశాలలకు మండల కోఆర్డినేటర్ల సహయంతో కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేశారు. కాగా జూన్ 1న వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ పాఠాల బోధన దఖలాలు లేవు.
నిరుపయోగంగా పరికరాలు
విద్యుత్ సౌకర్యం, కేబుల్ సౌకర్యం ఉన్న పాఠశాలల్లో మాత్రమే తొలివిడత కింద డిజిటల్ తరగతుల బోధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటి కోసం ప్రత్యేకంగా టైం టేబుల్‌ను కూడా ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతుల బోధన కోసం ఏర్పాటు చేసిన కేబుల్, డిష్‌లు, కేబుల్ ద్వారా తీసుకున్న కనెక్షన్‌ల నుంచి ప్రస్తుతం సిగ్నల్ రాకపోవడంతో మన టీవీలో డిజిటల్ తరగతులకు సంబంధించిన ప్రసరాలు రావడం లేదు.
ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పరికరాలు అలంకరప్రాయంగా మిగిలిపోయాయి. ప్రతి రోజు 6, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఒక పిరియడ్ చొప్పున డిజిటల్ తరగతుల ద్వారా బోధన ఉంటుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం అంతగా అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆయా పిరియడ్‌లలో క్లాస్‌కే పరిమితం అవుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.