ఓ హోం వద్ద చిన్నారులకు ఆహారం పంపిణీకి సిద్ధం
దేశంలో ఆహారం కొరత..ఆహార పదార్థాల వృథా దాదాపు సమాన స్థాయిలో ఉందని ఇటీవలి ఓ కమిటీ నివేదికలో వెల్లడైంది. అన్నం ఎక్కువైపారవేస్తుండగా..ఆహారం లభించక అల్లాడుతున్న వారూ ఎక్కువే ఉన్నారు. ముఖ్యంగా వివాహం, వార్షికోత్సవం, పుట్టినరోజు...ఇలా వేడుక ఏదైనా 25 శాతం మేర ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అతిథ్య రంగ సంస్థలు ఏర్పాటుచేసేకార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతున్నట్లు తేల్చారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఓ సంస్థ ఆహారం వృథా కానీయకుండా పేదల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకుంది. ఏదైనా వేడుకలో చేసిన వంటకాలు మిగిలిపోతే సాధారణంగా డస్ట్‌బిన్‌లోకి వేస్తారు. అలా కాకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు..ఆ సంస్థ ప్రతినిధులు అక్కడ వాలిపోయి ఆ ఆహారాన్ని అన్నార్తుల చెంతకు చేర్చి కడుపునింపుతారు. ఔను..ఆహార కొరత ఎదుర్కొంటున్న ఎందరికో ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థ ఒక వరంగా మారిందనే చెప్పాలి. తమిళనాడులోనికోయంబత్తూర్‌లో వెలిసిన ఈ సంస్థ ఇప్పుడు నగరంలోనూ సేవలందిస్తోంది. దాదాపు 100 మందివాలంటీర్లు స్వచ్ఛందంగా ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థలో సభ్యులుగా చేరి ఎక్కడ ఆహారం మిగిలినా అక్కడ నుంచి బస్తీలకు చేర్చి పేదోళ్ల ఆకలి తీరుస్తున్నారు.
సనత్‌నగర్: కోయంబత్తూర్‌లో ప్రారంభమైన ‘నో ఫుడ్ వేస్ట్’ సేవలను స్ఫూర్తిగా తీసుకుని యూసుఫ్‌గూడ గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఉండే మురళి కలిగొట్ల తానొక్కడే నగరంలో ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మురళి తనకు తెలిసిన చోట ఫుడ్ మిగిలిపోయి ఉందంటే దానిని తీసుకుని అన్నార్తులకు వడ్డించేవాడు. ఇలా రెండున్నర ఏళ్లుగా సేవలందిస్తూ వస్తున్నారు. మురళి అందిస్తున్న సేవలు సోషల్ మీడియా కేంద్రంగా కోయంబత్తూర్‌లోని ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థ ప్రతినిధులకు తెలిసి..వారు మురళిని సంప్రదించారు. ఆయనకు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి నో ఫుడ్ వేస్ట్ సంస్థ కేంద్రంగా చేసుకుని మురళి తన సేవా యజ్ఞాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళారు. నగరానికి చెందిన దాదాపు 100 మంది వలంటీర్లుగా చేరిపోయారు. ఎనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ళ ప్రాయం వరకు నో ఫుడ్ వేస్ట్ సంస్థ సభ్యులు చేరి ఆహారం వృథా కానీయకుండా అన్నార్తుల చెంతకు చేరుస్తున్నారు.
వలంటీర్లు ఏం చేస్తారంటే...
నో ఫుడ్ వేస్ట్ సంస్థకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎక్కడైనా ఫంక్షన్ జరిగి అక్కడ ఆహారం మిగిలిపోయి ఉందంటే నో ఫుడ్ వేస్ట్‌కు కాల్ చేస్తే వెనువెంటనే ఆ సమాచారం గ్రూప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఎంతమందికి ఆహారం మిగిలి ఉంది, ఏయే రకాల వంటకాలు ఉన్నాయనే వివరాలు కూడా గ్రూప్‌లో ఉంచుతారు. తదనంతరం ఆ ఫంక్షన్ జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉండే వాలంటీర్లు అక్కడకు వెళ్తారు. ఆహారం ఎప్పుడు వండింది, క్వాలిటీ ఏవిధంగా ఉంది, భుజించడానికి వీలుగా ఉందా? లేదా అని ముందుగా పరీక్షలు చేస్తారు. వారే స్వయంగా తిని చూస్తారు. అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లి పేదల ఆకలి తీరుస్తారు.
50 హంగర్ స్పాట్స్ గుర్తింపు...
♦ సంస్థ ప్రతినిధులు 50 హంగర్ స్పాట్స్‌ను గుర్తించారు. నిమ్స్, గాంధీ ఆస్పత్రి, బేగంపేటలోని నైట్ షెల్టర్స్, అమీర్‌పేట ప్రభుత్వ బాలికల హాస్టల్, నాంపల్లి డాన్‌బాస్కో, ఎల్బీనగర్, కార్వాన్, మల్కాజ్‌గిరి తదితర ఏరియాల్లో స్పాట్స్‌ను గుర్తించారు.
♦ నో ఫుడ్ వేస్ట్ సంస్థ అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు 15 వేల మంది ఆకలిని తీర్చారు. ప్రతిరోజూ సగటున 20–30 ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
♦ పది మందికి లోపు సరిపడా ఆహారం ఉంటే పికప్ డెలివరీ యాప్ ప్రతినిధులను పంపించి వారి చేతనే పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
♦ ఇతరులు కూడా సంస్థతో కలిసివచ్చేందుకు వీరి సేవల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచుతున్నారు.
దాతల సహకారంతో మినీ వ్యాన్..
పెద్ద మొత్తంలో ఆహారం మిగిలిపోయి ఉన్న సందర్భాల్లో వాలంటీర్లు బైక్‌పై గానీ, లేదా కిరాయి వాహనంలో గానీ తీసుకువెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పలువురు దాతలు ఈ సంస్థ ప్రతినిధులకు మారుతి ఈకో వ్యాన్‌ను బహుమతిగా అందించారు. తమకు దగ్గరలోని ప్రాంతానికి వాలంటీర్లు మినీ వ్యాన్‌ను తీసుకువెళ్లి ఆహారాన్ని సేకరించి పేదలకు చేర్చుతారు. ఈ వాహనాన్ని అందరికీ మధ్యలో ఉండేలా అమీర్‌పేటలో ఉంచుతారు. భవిష్యత్తులో మరో వ్యాన్‌తో పాటు ఆహారం నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్‌ను కూడా సమకూర్చుకోవాలనే ఆశయంతో ముందుకుసాగుతున్నారు.
ఆ సంతృప్తి మాటల్లోచెప్పలేం..
ఆహారం వేస్ట్ చేయకుండా పేదల కడుపు నింపినప్పుడు పేదల ముఖాల్లో కనిపించే ఆ ఆనందం ఎనలేనిది. ఒక్కోసారి ‘రెండు మూడు రోజులైంది బాబూ..అన్నం తిని.. దేవుడిలా వచ్చి ఆకలి తీర్చారంటూ’ చెబుతుంటే మనసు కలచివేస్తోంది. అదే క్రమంలో ఆకలి తీర్చామన్న ఆత్మసంతృప్తి మాటల్లో చెప్పలేం. తమ సేవలతో కలసివచ్చేలా మరింత మంది వాలంటీర్‌గా ముందుకు వస్తే బాగుంటుంది. ఎవరైనా సరే ఆహారం మిగిలితే పడేయకుండా మాకు సమాచారం అందించండి. మా వలంటీర్లు వచ్చి సేకరించి పేదల కడుపు నింపుతారు.– మురళి, నో ఫుడ్ వేస్ట్ సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్
ఆహారం మిగిలితే ఫోన్ చేయండి
నంబర్లు: 98660 06269
కాల్‌సెంటర్: 90877 90877
Comments
Please login to add a commentAdd a comment