సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు పాత కష్టాలే. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు పదేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సకాలంలో భర్తీ చేయాలన్న ధ్యాస అధికారుల్లో లేకుండా పోయింది. ఫలితంగా విద్యాబోధన గందరగోళంగా మారింది. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమో దం తెలిపి 15 నెలలు గడిచినా, గత ఏడాది అక్టోబర్ 10న యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో గవర్నర్ అదేశించినా ఇంకా ఆచరణకు నోచుకోలేదు. పోస్టుల కోసం నిరుద్యోగులకు పదేళ్లుగా నిరీక్షణ తప్పడంలేదు.
ఉస్మానియా యూనివర్సిటీలోనే లైబ్రరీ సైన్స్, లింగ్విస్టిక్స్ డిపార్ట్‌మెంట్లలో ప్రొఫెసర్లే లేరు. మిగతా యూనివర్సిటీల్లోనూ అంతే. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల నియామకానికి 2008లో నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తరువాత వాటి జోలికి వెళ్లలేదు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్లను భర్తీ చేసిన ప్రభుత్వం ఆ తరువాత వాటిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నియామకాలు చేపడతారని భావించిన నిరుద్యోగులకు నిరాశ తప్పలేదు. జూనియర్ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది నిరుద్యోగుల గరిçష్ట వయోపరిమితి కూడా దాటిపోయింది. ఏటా రెండుసార్లు జాతీయ అర్హత పరీక్ష, ఒకసారి రాష్ట్ర అర్హత పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించడం లేదు.
5,278 పోస్టుల్లో 4,441 పోస్టులు ఖాళీనే...
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మంజూరైన పోస్టులు 5,278 ఉండగా, అందులో 4,441 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. 837 మంది రెగ్యులర్ లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దాదాపు 3,500 మంది కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతోనే ఇంటర్మీడియెట్ విద్యాబోధన కొనసాగుతోంది. డిగ్రీ కాలేజీల్లో 2,730 మంజూరైన పోస్టులుంటే అందులో 1,419 మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 1,311 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. వాటిల్లోనూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్లే కొనసాగుతున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 1500కు పైగా రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసేందుకు వీలుగా ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
కాంట్రాక్టులోనైనా అవకాశం ఇవ్వరెందుకు?
కాంట్రాక్టు పోస్టుల్లో తమకెందుకు అవకాశం కల్పిం చరని నిరుద్యోగులు వాపోతున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తే ప్రతిభావంతులకు ఉపాధి లభిస్తుందని నిరుద్యోగి సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా భర్తీకి దిక్కులేదు
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో మొత్తంగా 1,551 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గతేడాది తేల్చింది. ప్రస్తుతం వాటిసంఖ్య 1,790కి చేరుకుంది. గతేడాది ఆమోదించిన పోస్టుల్లో మొదటిదశ 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పినా అధికారులు జాప్యం చేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌ల్లోనే నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవహారం పేరుతో కాలయాపన చేశారు. తరువాత యూజీసీ నిబంధనలను (నియామకాల డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్) మార్పు చేసిందని, కొత్త వాటి ప్రకారం నియామకాలు చేపట్టాలా? పాత నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలా? అంటూ కాలం వెళ్లదీశారు.
రోస్టర్ కమ్ రిజర్వేషన్లను విభాగాల వారీగా తీసుకోవాలా? యూనివర్సిటీ వారీగా తీసుకోవాలా? అన్న విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, దాని నేపథ్యంలో యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై స్పష్టత లేదని, అప్పట్లో యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై అధ్యయనం పేరుతో మొన్నటి వరకు కాలయాపన చేశారు. చివరకు యూజీసీనే పాత నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తోందని, అప్పటివరకు నియామకాల కోసం చేపట్టిన ప్రక్రియను ఆపాలని యూజీసీ పేర్కొంది. దీంతో ముందుగానే మనం పాత నిబంధనలతో భర్తీ చేస్తే సరిపోయేదని, జాప్యం చేయకుండా ఉండాల్సిందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment