
అప్పుల హద్దులు వద్దు
- ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సడలించండి
- నీతి ఆయోగ్ బృందాన్ని కోరిన సీఎం కేసీఆర్
- 6 జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కోరిన ప్రభుత్వం
- మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వాలని విజ్ఞప్తి
- గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ. 300 కోట్లకు వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వనరుల వృద్ధికి అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నిబంధనలను సడలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్, సలహాదారు అశోక్‌కుమార్ జైన్‌లు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిని కలుసుకున్నారు. వివిధ ముఖ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
అనంతరం నీతి ఆయోగ్ బృందంలోని సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ప్రకటించటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు భారీగా గండి పడిందని ఆందోళన వెలిబుచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు భారీగా తగ్గిపోయాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం కావటంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. ఐసీడీఎస్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంపై అదనపు భారం పడింది’ అన్నారు.
వీటన్నింటి దృష్ట్యా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 3.9 శాతం ద్రవ్యలోటుగా చూపిస్తూ రాష్ట్రాలకు 3 శాతం ద్రవ్యలోటును పరిమితం చేయటం విచిత్రంగా ఉందన్నారు. కేంద్రం తరహాలోనే తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని కోరారు. రుణ సేకరణకు వెసులుబాటు కల్పిస్తే మౌలిక వసతులకు పెట్టుబడులు సమకూరుతాయని, ఇది రాష్ట్రాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
అంతకుముందు ఉన్నతాధికారులతో భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న నీతి ఆయోగ్ బృంద సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారులు జీఆర్ రెడ్డి, పాపారావు, ఏకే గోయల్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, వాటర్‌గ్రిడ్ ఎండీ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఈ భేటీలో పాల్గొన్నారు.
నేడు రెండు జిల్లాల్లో నీతి ఆయోగ్ బృందం పర్యటన...
నీతి ఆయోగ్ బృందం శుక్రవారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనుంది. సిద్దిపేట, గజ్వేల్ మండలాల్లో మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన పనులు, సిద్దిపేటలో తాగు నీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో మిషన్ కాకతీయ పనులు, నుస్తులాపూర్‌లో స్వచ్ఛభారత్, తాగునీటి సరఫరాను పరిశీలిస్తారు.
బీఆర్‌జీఎఫ్ నిధులివ్వండి..
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీఆర్‌జీఎఫ్ నిధులు మంజూరు చేయాలని అధికారులు నీతి ఆయోగ్ బృందాన్ని సీఎం కేసీఆర్ కోరారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విభాగాల వారీగా కార్యక్రమాలు, నిధులకు సంబంధించిన అభ్యర్థనలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, గతంలో పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి కోరారు. స్పందించిన నీతి ఆయోగ్ బృందం సభ్యులు.. జిల్లాలు మొత్తంగా కాకుండా అక్కడ చేపట్టే కార్యక్రమాలకు నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. దీంతో ఆరు జిల్లాల్లో అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్నామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు బదులిచ్చారు. జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.300 కోట్లు కేటాయించాలని కోరారు.