నిరుపయోగంగా పీహెచ్‌సీ ఆపరేషన్ థియేటర్
పట్టించుకోని ఆరోగ్య శాఖ అధికారులు
నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయక పదేళ్లవుతోంది. జనాభా పెరుగుదల నియంత్రణపై గంటల తరబడి మాట్లాడే అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణకు కావాల్సిన అన్ని వసతులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నా సర్జన్ లేకపోవడంతో థియేటర్ నిరుపయోగంగా మారింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి దాదాపు 150 నుంచి 200 మంది రోగులు ప్రతి రోజు పీహెచ్‌సీలకు వైద్య పరీక్షల నిమిత్తం వస్తుంటారు.
నెలలో 30 నుంచి 35 మంది గర్భిణిలు కాన్పుల కోసం పీహెచ్‌సీకి వస్తుంటారు. అయితే పదేళ్లుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం లేదు. దీంతో చాలా మంది మహిళలు ఉటూర్ ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆదిలాబాద్ రిమ్స్‌కు వెళ్లి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. పీహెచ్‌సీలో మొత్తం నాలుగురు డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిలో ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక వోపీ ఏఎన్‌ఏం, ఇద్దరు సూపర్‌వైజర్లు, ఏడుగురు ఏఎన్‌ఏంలు విధులు నిర్వహిస్తున్నారు.
వసతులు లేక రోగుల ఇక్కట్లు
మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగులు పడుకునేందుకు కనీసం బెడ్డు, దుపట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షల నిమిత్తం వచ్చే రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీహెచ్‌సీలో ఫార్మసిస్ట్ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రత్యేక అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్ట్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోనే నార్నూర్ ఆతి పెద్ద మండలం అయినప్పటికీ పీహెచ్‌సీలో సిబ్బంది కొరత వేధిస్తోంది.