సాక్షి, ఖమ్మం : ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధారణంగా రెండు, మూడేళ్లకు బదిలీ అవుతుంది. కానీ ఇది పురపాలకంలో ఉన్న ఉద్యోగులు, సిబ్బందికి వర్తించదట..? ఒకటి..రెండు...మూడు... కాదు ఐదేళ్లు, పదేళ్లు... 20 ఏళ్లకు పైగానే జిల్లాలో పురపాలక సిబ్బంది కుర్చీని వదలకుండా తిష్టవేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఒకరిద్దరు అధికారులు మూడేళ్లకు పైగా సర్వీస్ దాటితే... ఖమ్మం కార్పొరేషన్‌లో మాత్రం ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తుండటంతో వారికి విధులంటేనే చిన్నచూపుగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దీర్ఘకాలంగా తిష్ట వేసిన ఉద్యోగుల బదిలీకి కసరత్తు చేస్తోంది.
జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది సర్వీస్ మూడేళ్లు పూర్తయితే తప్పకుండా బదిలీ చేయాలి. ఉద్యోగులు ఎక్కువ కాలం ఒకేచోట ఉంటే విధులపై నిర్లక్ష్యం ఆవరించడంతోపాటు ప్రజా సమస్యలపై స్పందించరనే కారణంతో ప్రభుత్వం ఒక చోట మూడేళ్ల సర్వీస్ చేసిన వారిని బదిలీ చేయాలనే నిబంధన విధించింది.
అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం కొంతమంది అధికారుల సర్వీస్‌ను ఒకటి నుంచి రెండేళ్ల వరకు పొడిగించే వెసులుబాటు కల్పించింది. కానీ జిల్లాలో ఎక్కువగా ఖమ్మం కార్పొరేషన్‌లోనే అధికారులు, సిబ్బంది ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజా పాలన గాడి తప్పిందనే విమర్శలు ఇటీవల ఊపందుకున్నాయి. ‘మన డివిజన్- మన ప్రణాళిక’, సమగ్ర సర్వే సమయంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఉన్నతాధికారుల నుంచి అక్షింతలు వేయించుకున్నారు.
కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మొత్తం ఉద్యోగుల్లో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే వారు మినహా ఎక్కువ మంది అధికారులు, సిబ్బంది దీర్ఘకాలికం గా పనిచేస్తున్నారు. ఆరుగురు సీనియర్ అసిస్టెంట్‌లు ఉంటే... అందరూ మూడేళ్లకు పైగానే సర్వీస్‌లో ఉన్నవారే. ఓ సీనియర్ అసిస్టెంట్ 19 ఏళ్లకుపైగా, మరో సీనియర్ అసిస్టెంట్‌లో 15 ఏళ్లు, ఇంకో సీనియర్ అసిస్టెంట్ 11 ఏళ్లుగా కుర్చీని వదలకుండా ఉన్నారు. అలాగే తొమ్మిదిమంది జూనియర్ అసిస్టెంట్లలో నలుగురు మూడేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇక పురపాలక ఖజానా నింపే బిల్ కలెక్టర్లు తొమ్మిది మంది ఉంటే ఇందులో ఏడుగురు మూడేళ్లకు పైగానే తిష్టవేశారు. ఓ బిల్ కలెక్టర్ 12 ఏళ్లుగా.. మరో బిల్ కలెక్టర్ 22 ఏళ్లుగా ఇక్కడే విధుల్లో ఉండటం గమనార్హం. అలాగే ఓ డీఈ, మరో ఏఈ సర్వీస్ మూడేళ్లు దాటింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఓ డీఈ మూడేళ్లకు పైగా విధుల్లో ఉన్నారు. అలాగే ఇల్లెందు మున్సిపాలిటీలో ఇద్దరు బిల్ కలెక్టర్లు, పాల్వంచ మున్సిపాలిటీలో మరో ముగ్గురు అధికారుల సర్వీస్ కూడా మూడేళ్ల పైనే ఉంది.
రాజ‘కీ’య అండదండలు..
మున్సిపల్ అధికారులు, సిబ్బందికి రాజకీయ నాయకుల అండదండలు తోడవడం వల్లే ఏళ్లుగా కుర్చీలకు అతుక్కుపోయారన్న ఆరోపణలున్నాయి. ఆయా శాఖల్లో కమీషన్ల పర్వం జోరుగా ఉండటంతో అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి బదిలీపై మరోచోటుకు వెళ్లాలంటే ఇష్టపడటం లేదు. అంతేకాకుండా ఎప్పుడైనా బదిలీపై ప్రతిపాదనలు వెళ్లినా తమకు అనుకూలంగా ఉండే ప్రజాప్రతినిధులు, నేతల వద్దకు వెళ్లి బదిలీకి అడ్డుకట్ట వేయిస్తున్నారు.
అయితే కార్పొరేషన్‌లో అవినీతి బయటపడిన, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి మెమోలు జారీ చేస్తున్నారే తప్ప బదిలీలు మాత్రం కావడం లేదు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు పలుమార్లు ఆందోళన చేసినా ఫలితం లేదు. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్‌లో ఉన్న సిబ్బందిలో 80 శాతానికి పైగా ఏళ్లకు ఏళ్లు విధులు నిర్వహిస్తుండటంతో నగర పాలన అస్తవ్యస్తంగా మారింది.
డీఎంఏకు నివేదిక..
మన డివిజన్..మన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా దీర్ఘకాలికంగా తిష్టవేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎంతమంది ఎంతకాలంగా పనిచేస్తున్నారు అనే వివరాలను పంపాలని బుధవారమే ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు మూడు మున్సిపాలిటీల కమిషనర్లను డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) ఆదేశించింది.
ఈ బదిలీలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టి పెట్టడంతో కమిషనర్లు ఆగమేఘాల మీద ఈ వివరాలను గురువారం సాయంత్రానికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టరేట్‌కు పంపారు. దీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న అధికారులు, సిబ్బందికి బదిలీలు కానున్నాయన్న సమాచారం తెలుసుకుని ఇంకా ఇక్కడే ఉండేందుకు తమకు తెలిసిన ప్రజా ప్రతినిధులు, నేతలతో పైరవీలు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీటికి చెక్ పెట్టి ప్రభుత్వం ఏ మేరకు లాంగ్ స్టాండింగ్ అధికారులను బదిలీ బాట పట్టిస్తుందో వేచి చూడాల్సిందే.
కదలరు.. మెదలరు
Published Fri, Aug 29 2014 2:33 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement