అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు భద్రతా పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాలున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ మేరకు రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, వీసీ సజ్జనార్ కూడా ఉత్తర్వులిచ్చారు. బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకొని బుధవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవచ్చన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, నేతలు వీటిని నిర్వహించవద్దని ఆయన కోరారు. ఆయా ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాంగ్‌రూమ్స్‌కు ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం మూడంచెల భద్రత కల్పించామన్నారు. రాష్ట్రంలోని 48 ప్రాంతాల్లో మంగళవారం జరుగనున్న కౌంటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ ఏజెంట్లు, మీడియాకు సైతం ప్రత్యేక ప్రాంతాలు కేటాయించామని, ఎవరూ దగ్గరకు వెళ్లరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఆద్యంతం వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం స్ట్రాంగ్‌రూమ్స్‌కు డీఎస్పీ/అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించామని, కౌంటింగ్ సెంటర్‌కు ఎస్పీ/డీసీపీలు నేతృత్వం వహిస్తూ భద్రత, బందోబస్తులను పర్యవేక్షిస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచీ రాష్ట్రంలో ఒక్క పెద్ద ఉదంతమూ జరుగకుండా, ఒక్క చోటా రీ–పోలింగ్ లేకుండా రికార్డు సృష్టించామని, కౌంటింగ్ నేపథ్యంలోనూ అంతే సంయమనం పాటించి గర్వకారణంగా నిలవాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో పికెట్లు, గస్తీ, నిఘా పెంచడంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు తాండూరు అభ్యర్థి కెప్టెన్ రోహిత్‌రెడ్డికి అదనపు భద్రత కల్పించమని కోరారని, సానుకూలంగా స్పందించిన డీజీపీ ఆదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1649 కేసులు నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య 1550 వరకు ఉందని చెప్పారు. పోలింగ్ రోజునే 41 కేసులు రిజిస్టర్ అయినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment