అభిప్రాయాలకే పెద్దపీట..!
► కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం
► నాయకుల్లో చిగురించిన ఆశలు
► నామినేటెడ్ పోస్టుల భర్తీపై జోరుగా ఊహాగానాలు
► మార్కెట్ కమిటీ పదవికి పోటీ తీవ్రం
నేరడిగొండ : నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పదవులు భర్తీ చేస్తారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. బోథ్, ఇచ్చోడ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలంలోని టీఆర్‌ఎస్ నాయకుల్లో ఆశలు చిగురించాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల్, డెరైక్టర్ల ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఇప్పటి వరకు తన స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశవహులు ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
బోథ్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవికి తీవ్ర పోటీ ఉన్న పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీఆర్‌ఎస్ నాయకులు తాము పార్టీకి చేసిన సేవలు వివరిస్తూ తమ బలాన్ని చూపుతున్నారు. కుల సంఘాలు, రైతు నాయకులు, పార్టీ శ్రేణులు తమకు అనుకూలంగా ఉన్నారని వారు ఎమ్మెల్యేకు వివరిస్తున్నారు. తమ పని తీరును గుర్తించి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరినీ నిరుత్సాహపరచకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరినీ సమన్వయ పరిచి అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.