బతుకుపోరులో బాల్యం బందీ | not success education act | Sakshi
Sakshi News home page

బతుకుపోరులో బాల్యం బందీ

Published Wed, Sep 17 2014 2:18 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

not success education act

ఆదిలాబాద్ టౌన్ : పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లలో, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నాయి. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు రోడ్లపై చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు బిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటులవైపుగా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్నీ మొక్కుబడిగా అమలుతున్నాయి.

 ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా..
 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్, చదువుల పండగ, బడిబాట, విద్యాపక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్ చదువుల పండగ.. ఇలా పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే బడి పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఇప్పటికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు 500 మందికి పైగా పిల్లలు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నియోజకవర్గంలోని ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో నిరక్షరాస్యులు, బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. ఆదిలాబాద్ పట్టణంలో సైతం బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యలోనే ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. విద్యాహక్క చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి.

 నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం
 సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం పేద పిల్లలకు అందడం లేదు. ఐదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువకావడం లేదు. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.

2009 అగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని అమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలుచేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడంతోనే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలుకావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా, బడి బయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. ఏడాది కేడాది బడిబయట పిల్లల సర్వే ఒక్కో రకంగా ఉంటోంది.

 పిల్లల్ని బడిలో చేర్పించాలి
 బడి బయట ఉన్న పిల్లలందరినీ తిరిగి బడిలో చేర్పించే బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలంద రూ బడిలోనే ఉండాలి. బడీ ఈడు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమవుతుంది. ఉపాధ్యాయులు బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేలా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement