ఎన్నెస్పీ తాత్కాలిక ఉద్యోగి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన మృతికి ముగ్గురు వ్యక్తులు కారణమంటూ తను వేసుకున్న
చిలుకూరు : ఎన్నెస్పీ తాత్కాలిక ఉద్యోగి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన మృతికి ముగ్గురు వ్యక్తులు కారణమంటూ తను వేసుకున్న బనీన్‌పై ఎర్ర అక్షరాలతో రాతలు రాశాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొండాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, బంధువుల కథనం మేరకు.. కొండాపురం గ్రామానికి చెందిన పాయిలి సత్యనారాయణ (48) ఎన్నెస్పీ కాలువలపై తాత్కాలిక లస్కర్‌గా పనిచేస్తున్నాడు. వేకువజామున గ్రామ శివారులో చెట్టుకు వెళాడుతున్న వ్యక్తి అటుగా వెళ్లిన రైతులకు కనిపించాడు. దగ్గరికి వెళ్లి చూడగా, అప్పటికే మృతిచెంది ఉన్నాడు. లస్కర్ సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించిన సదరు రైతులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది.
గ్రామపెద్దలు అక్కడి వెళ్లి చెట్టుకు వెళాడుతున్న సత్యనారాయణ మృతదేహాన్ని కిందికి దించారు. కాగా, మృతుడి ఒంటిపై ఉన్న బనీన్‌పై తన చావుకు గ్రామానికి చెందిన, ఎన్నెస్పీలోనే ఉద్యోగం చేస్తున్న పల్లా వెంకటేశ్వర్లు, పల్లా గోపాల్‌రావు, పల్లా నాగరాజులే కారణమంటూ ఎర్ర అక్షరాలతో రాతలు రాసి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ అబ్దుల్ వాహెబ్ సిబ్బందితో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సత్యనారాయణ మృతికి కారణమైన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
ఉద్యోగాలిప్పిస్తామని..?
ఎన్నెస్పీలో పనిచేస్తున్న సత్యనారాయణ, మరో ఉద్యోగి పల్లా వెంకటేశ్వర్లు, పల్లా గోపాల్‌రావు, పల్లా నాగరాజులు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతకు ఎర వేశారని తెలిసింది. ఇలా మూడేళ్లుగా ఈ నలుగురు కలిసి కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 36 మంది నిరుద్యోగులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్ష చొప్పున డబ్బులు వసూలు చేశారని సమాచారం. అయితే వీరికి మిర్యాలగూడకు చెందిన ఓ వ్యక్తితో కలిసి వీరు వసూళ్ల పర్వాన్ని సాగించారని తెలియవచ్చింది. డబ్బులు ఇచ్చిన మూడేళ్లుగా ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల హుజూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చినట్టు గ్రామంలో చర్చ జరుగుతోంది.
పెద్దమనుషుల పంచాయితీలో తేల్చుకుంటామని..
ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసగించారని బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నలుగురు తొలుత కేసు కాకుండా చూస్తున్నారని తెలసింది. ఈ వ్యవహారాన్ని గ్రామ పెద్దల సమక్షంలో తేల్చుకుంటామని ఇటీవల పంచాయితీ కూడా నిర్వహించారని గ్రామస్తులు తెలిపారు. అయితే నిరుద్యోగుల వద్ద తీసుకున్న డబ్బు నలుగురు చెల్లించాలని పెద్దమనుషులు తీర్మానించారని సమాచారం. అయితే సత్యనారాయణ మాత్రం ఆ డబ్బు తాను ఏమీ వాడుకోలేదని, వసూలు చేసిన మొత్తం పల్లా వెంకటేశ్వర్లు, పల్లా గోపాల్‌రావు, పల్లా నాగరాజులకే ఇచ్చానని వాపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే పెద్ద మనుషులు మాత్రం ఒప్పుకోకుండా నలుగురు డబ్బులు చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.