పొడుస్తున్న పొత్తులతో
మారుతున్న సమీకరణలు మేజిక్ ఫిగర్‌కోసం
పార్టీల ముమ్మర ప్రయత్నాలు జతకడుతున్న
చిరకాల రాజకీయ ప్రత్యర్థులు ఆసక్తి రేకెత్తిస్తున్న
శాసనమండలి ఎన్నికలుసాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ;శాసనమండలి సమరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జంప్‌జిలానీలు, జతకడుతున్న ప్రత్యర్థులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గ తేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లను సాధించింది. రెండో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్, మూడో స్థానంలో టీడీపీ నిలిచాయి. అయితే ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సమీకరణలు మారిపోయాయి. సంఖ్యాబలం లేకున్నా జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. చాలా మంది ఎంపీటీసీలు గోడ దూకడంతో ఆ పార్టీ బలీయశక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్, టీడీపీలు కకావికలమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటాలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమని టీఆర్‌ఎస్ ఆశిస్తోంది. కాగా, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో మండలి రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది. ముఖ్యంగా చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్, టీడీపీలు కౌన్సిల్ ఎన్నికల్లో సర్దుబాటు చర్చలు జరుపుతుండడం అధికారపార్టీని ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఇరుపార్టీలు జతకడితే ఉమ్మడిగా టీఆర్‌ఎస్‌ను నిలువరించడం పెద్ద కష్టమేమీకాదు. రెండు పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు చాలా మంది కారెక్కినప్పటికీ, ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు సరిపడా సంఖ్యాబలం ఉంది.
కూడికలు.. తీసివేతలు
చేతులు కలిపితే రెండు సీట్లు గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపాయి. సిద్ధాంతాల మధ్య వైరుఢ్యం ఉన్నా.. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉమ్మడిగా టీఆర్‌ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే కోణంలో జిల్లా నాయకత్వాలు కలిసిపోదామని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ కూడా అండగా నిలుస్తుందని అంచనా వేస్తోంది. దీంతో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాదిలో దక్కించుకున్న సీట్లకంటే ప్రస్తుతం అదనంగా 34 స్థానాలు ఉన్నట్లు లెక్క తీసింది. ఇందులో కొంతమంది చివరి నిమిషంలో ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లినా గెలుపునకు ఢోకా ఉండదని అనుకుంటోంది. అదేతరుణంలో గతంలో పార్టీ మారిన కొందరు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. దీనికితోడు టీఆర్‌ఎస్ సీనియర్లలో ఉన్న అసంతృప్తులు కూడా తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే బల మైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపేలా వ్యూహాలకు పదు ను పెడుతోంది. జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థ ల్లో 766 మంది ప్రతినిధులుండగా, ప్రస్తుతం ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
సంఖ్యా ‘బలం’ ఇలా..
పార్టీల మధ్య అవగాహన కుదిరితే పక్షాల బలాబలాలు అనూహ్యంగా మారుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 236 మంది సభ్యులున్నారు. ఈ పార్టీ టీడీపీతో జతగడితే వీరి బలం 339కి పెరుగుతుంది. ఇప్పటికే టీడీ పీకి మిత్రపక్షంగా ఉన్న బీజీపీకి 44 మంది సభ్యులున్నారు. తాజా కూటమిలో బీజేపీ కూడా చేరితే వీరి సంఖ్య 383కు చేరుతుంది.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టడంతో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారపార్టీ గూటికి చేరిపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్ వైపు 299 మంది ప్రతినిధులున్నారు. అయితే 26 మంది సభ్యులున్న మజ్లీస్ ఎవరికి మద్దతిస్తుందనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. అదేవిధంగా వామపక్ష పార్టీలకు చెందిన 12 మంది, స్వతంత్రులు 46 మంది ఏ పార్టీవైపు మొగ్గుతారో వేచిచూడాలి.
నంబర్ గేమ్!
Published Tue, Dec 1 2015 1:05 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement