‘భూ మార్పిడి’లో హస్తలాఘవం
తప్పుగా లెక్కిస్తూ ఖజానాకు నష్టం కలిగిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నప్పుడు విధిగా భూమార్పిడి అనుమతులు పొందాలి. దానికి సంబంధించి ఫీజులు, ముందస్తు అనుమతి లేనప్పుడు ప్రభుత్వానికి జరిమానా చెల్లించాలి. ఈ విషయంలో అధికారులు యథేచ్ఛగా హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. ఒక్క రంగారెడ్డి తూర్పు విభాగం పరిధిలోనే 774 మంది/సంస్థలు 4,310 ఎకరాల భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ భూముల మార్పిడికి సంబంధించి అనుమతులు పొందలేదు. దాంతో మార్పిడి పన్ను/జరిమానాలకు సంబంధించి రూ. 296.27 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదు. ఇదే ప్రాంతంలో కొందరు మాత్రం పన్ను చెల్లించినా... అధికారులు తప్పుగా లెక్కించి ఖజానాకు నష్టం కలిగించారు. 58 ఎకరాలకు సంబంధించి రూ. 2.87 కోట్లు వసూలు కావాల్సి ఉండగా... రూ. 1.64 కోట్లే వసూలు చేశారు.
చేవెళ్ల డివిజన్‌లో 28.22 ఎకరాల భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించి రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చింది. ఇందుకు రూ. 20.49 కోట్ల మేరకు భూ మార్పిడి పన్ను, జరిమానా నోటీసులు జారీ చేయాల్సి ఉన్నా అధికారులు స్పందించలేదు. చేవెళ్ల, మెదక్ డివిజన్‌లలో భూ వినియోగ మార్పిడికి సంబంధించి ఫీజు, జరిమానా నోటీసుల్లో విస్తీర్ణాన్ని 14.38 ఎకరాలకు గాను 1.07 ఎకరాలుగా చూపారు. ఫలితంగా రూ. 8.64 కోట్ల మేర ప్ర భుత్వ ఖజానాకు నష్టం కలిగింది. 2006-2012 మధ్య కాలంలో తెలంగాణతో పాటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు భూ మార్పిడి ఫీజు చెల్లించలేదు. 13,153 ఎకరాలకు సంబంధించి 84.54 కోట్ల ఎగవేత జరిగింది.