మూడుముక్కలాట
► పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు
► అనుమతి రమ్మీకి..ఆడుతోంది తీన్‌పత్తా
► తనిఖీలకు పూనుకోని పోలీస్‌శాఖ బలవుతున్న మధ్యతరగతి
► ఆట కోసం ఇతర జిల్లాల నుంచి రాక..
► జిల్లాలో రిక్రియేషన్ క్లబ్‌ల పేరిట దందా
పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. మూడు ముక్కలాట మధ్యతరగతి కుటుంబాలను ముక్కలు చేస్తోంది. ప్రభుత్వ ఉక్కుపాదంతో పేకాట క్లబ్‌లు కొన్నాళ్లు మూతపడగా.. కొందరు కోర్టుకు వెళ్లి రిక్రియేషన్ క్లబ్‌ల పేరిట మళ్లీ పేకాట దందాకు తెరలేపుతున్నారు. దీంతో ఇతర జిల్లాలనుంచి ఇక్కడికి పేకాడేందుకు తరలివస్తున్నారు. ఇతర జిల్లాల్లో అనుమతివ్వని పోలీస్‌శాఖ మన జిల్లాలో మాత్రం పేకాట నిర్వహణకు తలుపులు బార్లా తెరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. - కరీంనగర్ క్రైం
పేకాటలో చిత్తవుతున్నవారి బాధలు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పేకాట స్థావరాలు, క్లబ్‌లు మూసేయించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. దీంతో క్లబ్‌లు, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో పోలీసులు వాటి ని మూసివేయించారు. దీనిపై పలువురు వీటిపై కోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో జిల్లాలో కొన్ని పేకాట క్లబ్‌లకుఅనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోటాపోటీజిల్లాలో పేకాట క్లబ్‌లకు అనుమతులు మంజూరయ్యాయని కొంతకాలంగా ప్రచారం చేసుకున్న జి ల్లాలోని ఓ రిక్రియేషన్ క్లబ్ అనేక మందిని సభ్యులు గా చేర్చుకున్నారు.
సభ్యత్వం కోసం అక్షరాల రూ. లక్ష వసూలు చేశారని సమాచారం. సభ్యులుగా చేరి న వారికి మాత్రమే పేకాట ఆడడానికి అనుమతిస్తా రు. కొత్తగా ఏర్పాటుచేసిన క్లబ్‌లో పేకాట ఆడడానికి మాత్రమే వచ్చే వారికి కోసం ప్రత్యేకంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేసి సభ్యులుగా తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం పేకాటరాయుళ్లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపిస్తుండడంతో జిల్లాతోపాటు వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అనేకమంది పేకాడేందుకు జిల్లాకు తరలివస్తున్నారు. వీరి రాకతో సదరు క్లబ్ కళకళలాడుతోంది.
వీరికే అనుమతులెందుకు?
రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్‌లను ప్రభుత్వం మూసేయించడంతో కొందరు నిర్వాహకులు, ఇతరులు కోర్టులను ఆశ్రయించారు. ఈక్రమంలో కోర్టు పలు నిబంధనలు పెట్టింది. దీంతో పేకాట క్లబ్‌లను నిర్వహించడం తమతో కాదంటూ అనేకమంది మూసివేశారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోనే మూతపడగా.. జిల్లాలో అనుమతి రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని పోలీస్‌శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ పేకాట క్లబ్‌లకు అనుమతులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మాత్రం కొందరు పోలీసు అధికారుల మద్దతుతోనే అనుమతులు మంజూరు చేశారని ప్రచారం జరుగుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి పలువురి ఆత్మహత్యకు కారణమైన పేకాట క్లబ్‌లను మూసివేయాలనే డిమాండ్‌తో మహిళా సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి.
నిబంధనలు తోసిరాజని...
నిబంధనలను అమలు చేస్తున్నామంటూనే క్లబ్ నిర్వాహకులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. రిక్రియేషన్ క్లబ్‌లో సభ్యులను మాత్రమే పేకాట ఆడుకోవడానికి అనుమతిస్తారు. రమ్మీ మాత్రమే ఆడాలి. క్లబ్‌లో రెండుసెంటర్లు ఏర్పాటు చే స్తున్నట్లు సమాచారం. ఒకటి నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల కింద కొన్ని టేబుల్స్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ రమ్మీ మాత్రమే ఆడుతారు. మరోటి క్లబ్ చివరలో రహస్యంగా ఏర్పాటుచేసిన సెంటర్‌లో రూ.5 వేలు, రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ తీన్‌పత్తా(మూడు ముక్కలాట) ఆడిస్తున్నారని తెలుస్తోంది. సెంటర్‌లో కొంతకాలం సీసీ కెమెరాల వద్ద ఆడిన వారిని.. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకనే రహస్య కేంద్రంలోకి అనుమతిస్తున్నారని సమాచారం. ఈ క్లబ్ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొందరు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బయట సైతం కొన్నిచోట్ల మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా... కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఆట కొనసాగిస్తున్నారు.
మధ్యతరగతి ప్రజలే సమిధలు
పేకాటలో ఎక్కువగా బలవుతోంది మధ్యతరగతి ప్రజలే. మొదట వారికి కొంచెం లాభం వచ్చేట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. మరింతగా అప్పుచేసి ఆటలో పెడుతుండడంతో ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడడంతోపాటు పలువురు తీరని అప్పులు చేస్తూ నష్టపోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలామంది బయటకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవడమో... ఊరు విడిచి వెళ్లిపోవడమో చేస్తున్నట్లు సమాచారం.