జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం అన్ని హంగులతో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.2 కోట్లు మంజూరు చేయించి 10 నెలల్లో పూర్తి చేయించా. కొన్ని దుష్టశక్తుల కన్ను ఆర్డీఓ కార్యాలయంపైన, నాపైన పడింది. ఆ దిష్టిపోయేందుకే కొబ్బరి, గుమ్మడికాయలు కొట్టి ప్రారంభించా.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నల్లగొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య వివాదానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లా కాంగ్రెస్ నేతలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న రాజకీయ వర్గాల అంచనాలకు భిన్నంగా నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్‌తో ప్రత్యక్ష పోరుకు దిగారు. మందీమార్బలాన్ని తీసుకుని వెళ్లి తన చేతుల మీదుగా ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అయితే, ఈ ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవం ఆదినుంచి వివాదాస్పదంగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తిచేయించాము.. కనుక తన చేతుల మీదుగానే ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవం జరగాలని మొదటినుంచి కోమటిరెడ్డి పట్టుపడుతున్నారు. కానీ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న టీఆర్‌ఎస్ నాయకులు తొలుత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావించారు. నకిరేకల్ మండలం చందుపట్లకు సీఎం వచ్చినప్పుడు ఆయన చేత ప్రారంభించాలని భావిం చారు.. కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ను జిల్లా కేంద్రానికి రప్పించి ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలనుకున్నారు.
కానీ అది కూడా జరగకపోవడంతో సమయం కోసం అధికార పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్యంగా బోనాల పండగ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం ప్రారంభమంటూ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కేంద్రంలో హల్‌చల్ చేశారు. తన నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులను వందలాదిగా వెంటబెట్టుకుని వెళ్లి రామగిరి రోడ్డులో నిర్మించిన కొత్త ఆర్డీఓ కార్యాలయ భవనాన్ని అనధికారికంగా ప్రారంభించారు. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి నినాదాల మధ్య సోమవారం ఉదయం ఆర్డీఓ కార్యాలయ భవన ప్రాంగణం మారుమోగిపోయింది. భవన నిర్మాణం పూర్తయి 14 నెలలు దాటినా ప్రారంభానికి నోచుకోని ఆర్డీఓ కార్యాలయాన్ని కోమటిరెడ్డి ఉన్నపణంగా ఆగమేఘాల మీద సోమవారం ప్రారంభించేందుకు ప్రయత్నించారు.
ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం సాయత్రం పట్టణంలో ముఖ్య కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఫ్లెక్సీలు చింపేసినట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టణంలో శాంతిభద్రత చర్యలు చేపట్టారు. టీఆర్‌ఎస్ వర్గీయులే ఫ్లెక్సీలు చింపేసినట్లుగా భావించిన కాంగ్రెస్ శ్రేణులు సోమవారం కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెంట భారీగా తరలివచ్చారు. అయితే, ఇప్పటికే నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మద్య రాజకీయ విభేదాలు చాపకింద నీరులా ఉన్నా ఇటీవల కాలంలో రచ్చకెక్కాయి. ఇంతవరకు స్తబ్ధుగా ఉన్న ఈ వర్గపోరు కాస్తా ఎమ్మెల్యే నేరుగా రంగప్రవేశం చేయడంతో మరింత రసకందాయంలో పడ్డాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికారులు దూరం...
ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరుకావాల్సిన జిల్లా అధికారులు దూరంగానే ఉన్నారు. సోమవారం ఉదయం కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను లోపలికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు సర్దిచెప్పి లోపలికి వెళ్లిన ఎమ్మెల్యే దిష్టిగుమ్మడి కాయ కొట్టారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రారంభం అయిపోయిందని చెప్పి బయటకు వచ్చేశారు. అయితే, ఈ కార్యక్రమం అధికారికమా, అనధికారికమా అని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించినా అధికారులు అందుబాటులోకి రాలేదు. సాయంత్రానికి మాత్రం నల్లగొండ ఆర్టీఓ వెంకటాచారి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో 16 మంది అక్రమంగా ఆర్డీఓ కార్యాలయంలోనికి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తామేమీ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయలేదని, పోలీసుల ముందే కార్యాలయంలోనికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చామని కాంగ్రెస్ శ్రేణులంటున్నాయి.
ప్రత్యక్ష పోరుకు సన్నాహం...
ఆర్డీఓ కార్యాలయం ప్రారంభమంటూ సోమవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన హడావిడి అటు జిల్లా కేంద్రంతోపాటు జిల్లా రాజకీయ వర్గాల్లో చ ర్చనీయాంశమైంది. త్రిముఖ వ్యూహంతో కోమటిరెడ్డి ఈ చర్యకు పూనుకున్నారని కాంగ్రెస్ శ్రేణులంటున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపర్చడంతోపాటు తనపై గతంలో వచ్చిన ఆరోపణలను తొలగించుకుని తాను టీఆర్‌ఎస్‌తో ప్రత్యక్షంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ శ్రేణులకు సంకేతాలివ్వడం, తనహయాంలో కట్టించిన భవనాన్ని తానే ప్రారంభించాలన్న కోరిక నెరవేర్చుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని పార్టీ శ్రేణులంటున్నాయి.
అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నందున ఈ కార్యాలయ ఉదంతంతో కాంగ్రెస్ కేడర్‌ను కాపాడుకునేందుకు బ్రదర్స్ ఇద్దరూ టీఆర్‌ఎస్‌తో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదిఏ మైనా.. ఆర్టీఓ కార్యాలయ ప్రారంభం అధికారకమా.. అనధికారికమా... అక్కడి నుంచి కార్యకలాపాలు వెంటనే ప్రారంభమయినా కాకపోయినా... టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నడుమ ఈ వివాదం పెద్ద చిచ్చునే రగిల్చిందనేది రాజకీయ వర్గాల భావన.
రగడ..!
Published Tue, Aug 11 2015 1:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement