రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని సంగారం స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది.
పెద్దవూర (నల్లగొండ) : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని సంగారం స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం మొల్కచర్ల గ్రామానికి చెందిన కుర్ర విష్ణు(35) త్రిపురారం మండలం హర్జ్యాతండాకు చెందిన మహిళ విజయతో కలిసి దేవరకొండకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మండలంలోని సంగారం స్టేజీ దాటగానే ఇతని బైక్‌ను హైదరాబాద్ నుంచి మాచర్లకు వెళ్తున్న కారు ఎదురుగా ఢీ కొట్టింది.
దీంతో బైక్‌ను నడుపుతున్న విష్ణు, వెనుక కూర్చున్న విజయ కారు పైనుంచి ఎగిరి 50 అడుగుల దూరంలో పడ్డారు. ఈ ప్రమాదంలో విష్ణు అక్కడికక్కడే మృతి చెందగా విజయకు తీవ్ర గాయాలయ్యాయి. విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. విజయ చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాడాన ప్రసాదరావు తెలిపారు.