పేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది.
అపార్ట్‌మెంట్ పద్ధతిలోనే..
జిల్లాకు పది వేల చొప్పున నిర్మించే యోచన
మే చివరి నాటికి ప్రణాళికకు తుదిరూపు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ కసరత్తు
అపార్ట్‌మెంట్ పద్ధతికే సర్కారు మొగ్గు
తొలుత అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలకు పరిమితం
ఖర్చుపై ఆందోళన.. వైశాల్యాన్ని కుదించాలని నిర్ణయం
బడా సంస్థలకు బాధ్యత.. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో నిర్మాణం
ఇప్పుడు చేపట్టబోయే ఇళ్లను తొలుత సెమీ అర్బన్ ప్రాంతాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనిట్ కాస్ట్ తలకుమించిన భారంగా మారుతున్నందున అపార్ట్‌మెంట్ నమూనాలో నిర్మిస్తే ఖర్చు తగ్గుతుందని యోచిస్తోంది. గ్రామాల్లో అపార్ట్‌మెంట్ పద్ధతికి ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండనందున పట్టణాలు, వాటికి దగ్గరలోని మేజర్ గ్రామ పంచాయతీలనే ఎంపిక చేయనున్నట్టు సమాచారం.
ఈ ఇళ్ల నిర్మాణ బాధ్యతను బడా నిర్మాణ సంస్థలకు కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గంపగుత్తగా నిర్మిస్తే ఖర్చు కలిసి వస్తుండటమే దీనికి కారణం. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతి(పెద్ద వంతెనల తరహాలో ముందుగా విడిభాగాలు నిర్మించి తర్వాత జోడించటం)లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒకే చోట ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అక్కడే అందరికీ ఇళ్లను నిర్మించాలనేది తాజా నిర్ణయం.
సాక్షి, హైదరాబాద్: పేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రధాన హామీల్లో ఒకటైన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఈ పథకం విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా పడని సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా సగటున జిల్లాకు పది వేల చొప్పున రాష్ర్టవ్యాప్తంగా తొలుత లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గృహ నిర్మాణ శాఖ ప్రస్తుతం ఈ పనిలోనే తలమునకలై ఉంది. వచ్చే నెలాఖరునాటికి దీనికి ఓ రూపం వస్తుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పడక గదుల ఇళ్ల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ. 391 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు ఆయన పర్యటించి ఇళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చిన వరంగల్, మహబూబ్‌నగర్ పట్టణాల్లోనే తొలుత పనులు చే పట్టాలని ప్రభుత్వం భావించింది. అందుకే పరిమితంగా నిధులు కేటాయించింది. అయితే ఏడాదవుతున్నా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో స్పష్టత రాకపోవడంతో విమర్శల జడివాన మొదలైంది. ఇప్పటివరకు ప్రతిపక్షాల నుంచే విమర్శలు వస్తుండగా.. క్రమంగా ప్రజలు కూడా దీనిపై నిలదీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. దీంతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎం స్వయంగా కొంత స్పష్టతనివ్వనున్నట్టు సమాచారం. సీఐడీ విచారణ పేరుతో ఇప్పటివరకు ఇటుక కూడా పేర్చకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వం.. ఆ విచారణను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. దీంతో మరో ఏడాది వరకు ఆగాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఎట్టకేలకు ముఖ్యమంత్రి నిర్ణయంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
విస్తీర్ణం 425 చదరపు అడుగులే!
రెండు పడక గదుల ఇంటికి రూ. మూడున్నర లక్షల వ్యయమవుతుందని ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీ లెక్కలేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పలు సందర్భాల్లో ఈ లెక్కే చెప్పారు. కానీ ఆ డబ్బులు ఏమూలకూ చాలవని గృహ నిర్మాణ శాఖ తేల్చి చెప్పేసరికి ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఐదేళ్లలో పది లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పేర్కొన్న నేపథ్యంలో యూనిట్ కాస్ట్‌ను రూ. 3.50 లక్షలుగా తీసుకుంటే రూ.35 వేల కోట్లు అవసరం. దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని తొలుత భావించారు. కానీ అంత విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. దీంతో విస్తీర్ణాన్ని తగ్గించి లెక్కలేయాలని సర్కారు సూచించడంతో దాన్ని చివరకు 421-425 చదరపు అడుగులకు పరిమితం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి కూడా రూ. 5.50 లక్షల వరకు ఖర్చు కానుందని అధికారులు చెప్పడంతో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంతకంటే తగ్గిస్తే ఇల్లు ఇరుగ్గా మారే పరిస్థితి ఉండటంతో అంతవరకే పరిమితం చేయనున్నట్టు సమాచారం.
కేంద్రం నుంచి స్పష్టత కరువు
దేశంలో ఎక్కడా లేనట్టుగా పేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నందున నిర్మాణ వ్యయంలో పాలుపంచుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్రం ఇప్పటివరకు సానుకూల సంకేతాలివ్వలేదు. పైగా కేంద్ర బడ్జెట్‌లో ఇందిర ఆవాస్ యోజన ఇళ్లకు కేటాయింపులు భారీగా తగ్గించడంతో ఇక అక్కడి నుంచి ప్రత్యేక సాయం అందదని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయానికొచ్చింది. అయితే పట్టణ ప్రాంత గృహ నిర్మాణ పథకానికి సంబంధించి కేంద్రం ఇప్పటికీ కొంత ఆశతో ఉంది. కొత్త రూపంలో పథక రచన జరిగి కేంద్ర కేటాయింపులు పెరిగితే అందులో రాష్ట్రానికి అధికంగా నిధులు తెచ్చుకోవాలన్న అభిప్రాయంతో ఉంది. ఇందుకోసి అధికారులు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం.