
సాక్షి, కామారెడ్డి: ఓ చానెల్‌లో ప్రసారమవుతున్న ‘ జబర్దస్త్’ కామెడీ షో చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా ప్రసారమైన ’జబర్దస్’ ఎపిసోడ్‌లో అనాథలను కించపరిచేలా హైపర్ ఆది డైలాగులు ఉన్నాయంటూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అనాథలు ‘జబర్దస్’కు, హైపర్ ఆదికి వ్యతిరేకంగా రాష్ట్ర మానవహక్కుల సంఘానికి (హెచ్చార్సీ), పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాజాగా ‘జబర్దస్త్’ షోలో తమను అవమానించారంటూ కొందరు అనాథ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వారు సోమవారం ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్‌లో తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అనాథలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జబర్దస్త్ షోపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయాన్ని సినీ విమర్శకుడు కత్తి మహేష్ గతంలో ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని తెలిపాడు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే హైపర్ ఆది చెప్పిన డైలాగ్.. అనాథల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment