హిమాయత్‌నగర్: ‘కరోనా’ వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి కాంటాక్ట్స్‌ను సేకరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఓ ఎస్‌ఐని నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, వారు ఎవరెవర్ని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు అనే అంశాలపై వీరు సమగ్ర సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపాలి. మార్చి 23వ తేదీన నుంచి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల బదిలీపై వచ్చిన ఓ ఎస్‌ఐని కోవిడ్ ఇన్‌చార్జిగా ఎస్‌హెచ్‌ఓ నియమించారు. ప్రస్తుతం ‘కరోనా’ విలయతాండవం చేస్తోంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజూ ఒకటి రెండు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ కారణంగా వారి వివరాల సేకరణ, సెకండరీ కాంటాక్ట్ లిస్ట్ సేకరణ వంటి వివరాలు కోవిడ్ టీం ఇన్‌చార్జిగా ఉన్న ఎస్‌ఐ మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో తిరగాలి. ఎవరి నుంచి వైరస్ సోకుతుందో.. ఎప్పుడు ఏమవుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. ఇదే పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐలుగా మరో ఐదుగురు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ కనీసం పదిహేను రోజులపాటు కోవిడ్ ఇన్‌చార్జిగా నియమిస్తే బాగుంటుందని అధికారి వద్ద పలుమార్లు విన్నవించినా.. కనికరించకపోవడం ఎస్‌ఐల్లో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.
ఉన్నతాధికారులు చెప్పినా పట్టించుకోని వైనం
ప్రతి పోలీస్ స్టేషన్‌లో కోవిడ్ ఇన్‌చార్జిగా ఉన్న ఎస్‌ఐతో ఎక్కువ రోజులు అదే పని చేపిస్తే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి పదిహేను లేదా ఇరవై రోజులకు రొటేషన్ పద్ధతిలో అందరినీ ఆ విధులు నిర్వర్తించేలా చూడమని సెంట్రల్ జోన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్టేషన్‌లోని ఓ అధికారికి చెప్పినా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మరీ కోవిడ్ వైరస్‌కు గురైన వారి వద్దకు వెళుతున్నారు. ఈ వంద రోజుల్లో ఇటు లా అండ్ ఆర్డర్ విధులు, నైట్ డ్యూటీలు నిర్వర్తిస్తూ.. అటు బందోబస్తులు చేస్తూ.. మరో పక్క కోవిడ్ టీం బాధ్యతలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన రీతిలో వీక్లీ ఆఫ్‌లు సైతం లేకపోవడంపై తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోంది. ఓ పక్క కంటి నిండా నిద్ర కరువై, మరో పక్క కడుపు నిండా తినలేని పరిస్థితిలో ఉన్నట్లు పోలీస్ స్టేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉన్న ఆ ఒక్క ఎస్‌ఐకి కూడా ఏదైనా జరిగితే బాధ్యులెవరంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల మాట ధిక్కరించలేక, తోటి వారితో చెప్పుకోలేక సతమతం అవుతున్నారు ప్రతి పోలీసు స్టేషన్‌లోని కోవిడ్ ఇన్‌చార్జిగా ఉన్న ఎస్‌ఐలు.
Comments
Please login to add a commentAdd a comment