పరిశీలనలో వన్‌టైం సెటిల్‌మెంట్
రుణమాఫీపై సీఎం హామీ ఇచ్చారన్న కడియం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఇబ్బందులు, సాగు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో రెండు రోజులపాటు అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకముందే అనేక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారన్నారు. రుణమాఫీ వన్‌టైం సెటిల్‌మెంట్‌ను కూడా ప్రభుత్వం పరిశీస్తుందని, ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఏకమొత్తంలో చేసేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని సీఎం చెప్పారన్నారు. అయినా విపక్షాలు అర్థంపర్థం లేకుండా విమర్శలు చేస్తూ ఆందోళన చేయడమంటే రాజకీయం చేయడమేనన్నారు.
రైతు ఆత్మహత్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను విలేకరులు కడియం దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. గురువారం సచివాలయంలో కడియం విలేకరులతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరే గుండాలతో కొట్టిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ గూండాయిజం, రౌడీయిజం చేయలేదన్నారు.