
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటెక్కింది. తాత్కాలిక కొరతతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.20–25 ఉన్న ఉల్లి.. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.40 వరకు పలుకుతోంది. మలక్‌పేట్ మార్కెట్‌లో హోల్‌సేల్‌గా నాణ్యమైన ఉల్లి కిలో రూ.28.. మెత్తబడి, అంతగా బాగా లేని ఉల్లి రూ. 20 వరకు పలుకుతోందని మార్కెటింగ్ వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ కొరత వల్ల రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నాయి.
10 రోజుల్లో 80 శాతం..
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు ఉంటాయి. వీటిలో మహారాష్ట్ర నుంచే రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అయితే దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో 10 రోజుల్లోనే 80 శాతం మేర ఉల్లి ధరలు పెరిగినట్లు తెలిసిందని, ఆ కారణంగానే తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది ఉల్లికి గిట్టుబాటు కాక ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని మార్కెట్లు వారం రోజులు మూసేస్తారని, ఆ ప్రభావమూ ధరల పెరుగుదలపై ఉంటుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లోనే..
మార్కెట్‌లో ఉన్న ఉల్లి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్పత్తి అయిందే. నిల్వ చేసిన ఉల్లిలోనూ 30 శాతం వరకు వానలకు దెబ్బతిన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడం.. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతిని ఉల్లి మార్కెట్‌కు రావడం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. దీంతో రాష్ట్ర అవసరాలు తీరడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారని ఆరోపణలున్నాయి.
పెరిగింది వాస్తవమే..
మహారాష్ట్ర సహా ఉల్లి సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది. వర్షం, తేమ వల్ల నిల్వ ఉంచిన ఉల్లి చెడిపోతోంది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కిలో రూ.40 పలుకుతోంది. ఇది తాత్కాలికమే. త్వరలో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం.
– పార్థసారథి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment