=పెరిగిన ఉల్లి ధర
=రిటైల్‌గా కేజీ రూ.50-60
=రైతుబజార్‌లో రూ.44
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వాలనే కూల్చిపారేయగల శక్తివున్న ఉల్లి ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. గతకొంతకాలంగా వీపు విమానం మోతమోగిస్తున్న దీని ధర అమాంతం ఎగబాకి కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.60, గ్రేడ్ -2 రకం రూ.50 పలుకుతోంది. అంతోఇంతో తక్కువ ధరకు లభించే రైతుబజార్లలో సైతం గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.44కి చే రడం సామాన్య, పేదవర్గాలను కలవర పెడుతోంది. ఇటీవల వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో నగరానికి ఉల్లి దిగుమతులు బాగా పడిపోయినట్లు సమాచారం.
నగరానికి ప్రధానంగా కర్నూలు జిల్లా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి సరుకు దిగుమతి అవుతుంటుంది. ఆయా ప్రాంతాల్లో ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో ఉల్లి పంట దారుణంగా దెబ్బతింది. దీంతో దిగుమతి కూడా గణనీయంగా పడిపోయింది. ఫలితంగా నగరంలో డిమాండ్ -సరఫరాల మధ్య అంతరం ఏర్పడి ఆ ప్రభావం ధరల పెరుగుదలకు దారితీసిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
వ్యాపారులు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని ఒక్కసారిగా ధరలు పెంచేశారు. వారంక్రితం కిలో రూ.35 నుంచి రూ.40 పలికిన ఉల్లి ఇప్పుడు ఏకంగా రూ.60లకు ఎగబాకింది. మలక్‌పేట మహబూబ్‌మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌లో గురువారం గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.52, గ్రేడ్-2 ఉల్లి రూ.45 పలికిందని వ్యాపారులు చెప్పారు.
నిల్వ చేయకే ఈ దుస్థితి : మార్కెటింగ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. వర్షాలు కురిసినప్పుడు, ఇతరత్రా పరిస్థితులు ఎదురైన్పపుడు శాఖ ఆధ్వర్యంలో ఉల్లిని నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోవడంతో దిగుబడి తగ్గి ధరల పెరుగుదలకు దారితీసింది.
మొక్కుబడి రాయితీ : ఉల్లి ధరాభారంతో ప్రజలు అల్లాడుతుంటే నియంత్రించాల్సిన మార్కెటింగ్‌శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నగరంలో 9 రైతుబజార్లు ఉండగా..కేవలం 6 రైతుబజార్లలో మాత్రమే ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటు చేసి కేజీ రూ.38 ప్రకారం విక్రయిస్తున్నారు. అవికూడా నామమాత్రంగా ఒక్కోరికి కిలో చొప్పున రోజులో 3-4 గంటలపాటు ఇస్తుండటంతో అవి ఏమూలకు చాలడం లేదు.
ధరల తగ్గుదలకు కృషి : డిప్యూటీ డెరైక్టర్
చాదర్‌ఘాట్: మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు రావడం వల్లే ఉల్లి దిగుబడి తగ్గి ధరలు పెరిగాయని మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం తెలిపారు. ఉల్లి ధర పెరుగుదలపై మలక్‌పేట గంజ్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒడిషా, తాడేపల్లిగూడెం మార్కెట్లలో ఉల్లికి అధిక ధర పలకడంతో రైతులు సరుకును అటు తరలిస్తున్నారని పేర్కొన్నారు.