
సమావేశంలో మాట్లాడుతున్న రాజనర్సింహ
సాక్షి, పుల్‌కల్(అందోల్): సింగూర్ ప్రాజెక్టు నుంచి పోచంపాడ్‌కు నీటిని విడుదల చేయాలనే నిబంధనలు లేకున్నా అక్రమంగా నీటిని తరలించి ఈ ప్రాతం రైతుల కడుపు కొట్టిన టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ కోరారు. మంగళవారం మండల పరిధిలోని ఎస్.ఇటిక్యాల్, లక్ష్మీసాగర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టులో ఉన్న 16 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించడంతో ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరిందన్నారు.
ఫలితంగా సింగూర్ కాల్వలకు నీరు ఇవ్వకపోవడంతో పంట పొలాలు బీడుగా మారి వారి కడుపు మడిందన్నారు. అక్రమంగా నీటిని తరలించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఇటిక్యాల్ నుంచి కొడెకల్ వరకు బీటీ రోడ్డుతో పాటు పంట పొలాలకు కాల్వల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు లింగం, దుర్గారెడ్డి, దశరథ్, ప్రదీప్, నాయకులు బొయిని శ్రీనివాస్, పోచయ్య, టీజేఎస్ కన్వీనర్ పోచయ్య, సీపీఐ నాయకుడు నర్సింలు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.