
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై శనివారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై త్వరలో ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు.
ఓబీసీ వర్గీకరణపై అధ్యయనం జరుగుతోందని, ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపడి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్డీయేలోనే కొనసాగి ఉంటే ప్రత్యేక హోదా అంశంపై మోదీ సానుకూలంగా స్పందించే వారని పేర్కొన్నారు. పార్టీని రక్షించుకోలేని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పటం హాస్యాస్పదమని రాందాస్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment