జనుము సాగు(ఫైల్ ఫోటో)
అలంపూర్: వ్యవసాయం పూర్వకాలంలో మొత్తం సేంద్రియ ఎరువులపైనే ఆధారపడి జరిగేది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతో పాటుగా రసాయనాల వాడకం పెంచాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడుతూ దిగుబడులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వీటిని పక్కన పెట్టి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు సాగు చేస్తే ఎంతో మేలు కలగనుండగా.. భూసారానికి కూడా ఎలాంటి ముప్పు ఉండదు. ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండగా రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ మేరకు రసాయన ఎరువుల వాడకం వల్ల నష్టాలు, సేంద్రియ ఎరువుల వాడకంతో లాభాలపై అలంపూర్ ఏడీఏ మహ్మద్ ఖాద్రీ ఇచ్చిన సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
రసాయనాల వాడకంతో..
సాగులో విచక్షణరహితంగా బస్తాల కొద్ది రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకునే స్థాయి పంటల్ని ఆశించే పురుగుకు పెరుగుతుంది. తద్వారా పురుగుల బెడద అధకమవుతుంది. పోనుపోను రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం పెంచాల్సి ఖర్చులు పెరుగుతాయి. అలాగే, ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోయి.. నీరు, సాగు నేలలు కలుషితమవుతాయి.
నష్టాలు – సూచనలు
అధిక మొత్తంలో రసాయనాల వాడకంతో మిత్ర కీటకాలు నశించి పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. ఈ మేరకు రైతులు ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి. వ్యవసాయంలో పురుగుల మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్‌లో మన రైతులు పోటీకి నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. పంట ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించేలా సాగు చేసుకోవాలి.
సేంద్రియ విధానం
సాగులో లింగాకర్షన బుట్టలు వాడాలి. పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి. గంధకం, రాగి ఉత్పత్తులు వాడొచ్చు. వృక్ష సంబంధం నూనెలను కొన్ని జాగ్రత్తలతో వాడాలి. వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీకంపోస్టు ఎరువులను వాడితే మంచిది. పంట వ్యర్థాలు, కొబ్బరి వ్యర్థాలు, షజొల్లా కూడా ఉపయోగపడేవే. పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సేంద్రియ ఉత్పత్తుల వాడకంపై అవగాహన పెరిగి వాటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంలో పండించిన పంట ఉత్పత్తులకు తప్పక మంచి మార్కెట్ ఉంటుంది.
వేప చెక్క
సేంద్రియ ఎరువులతోనే సాధ్యం
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయ చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులైన వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు,
కోళ్ల ఎరువు, పచ్చి ఆకులు, పిండి చెక్కలు వాడాలి. నాణ్యమైన రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా వర్మీ కంపోస్టు బెడ్స్‌ను రూ.5వేల సబ్సిడీపై ఇస్తున్నారు. ఇంకా వ్యవసాయ శాఖ ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాలను రూ.5 శాతం సబ్సిడీపై లభిస్తాయి.
వర్మీ కంపోస్టు ఎరువులో వానపాములు
Comments
Please login to add a commentAdd a comment