
బోర్ల పేరిట ఘరానా మోసం
రూ.33 వేలు చెల్లిస్తే బోరువేసి మోటారు ఉచితంగా ఇస్తామని నమ్మబలికిన ఓ ముఠా మూడు జిల్లాల్లో 250 మంది రైతుల వద్ద సుమారు రూ.75 లక్షలు దండుకుంది.
* కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో దందా
* ముఠాలో నలుగురి అరెస్టు, ఐదుగురు పరారీ
హుస్నాబాద్ రూరల్: రూ.33 వేలు చెల్లిస్తే బోరువేసి మోటారు ఉచితంగా ఇస్తామని నమ్మబలికిన ఓ ముఠా మూడు జిల్లాల్లో 250 మంది రైతుల వద్ద సుమారు రూ.75 లక్షలు దండుకుంది. చివరికి బోర్లు వేయకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఠా సభ్యుల్లో కొందరిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య శనివారం విలేకరులకు వివరించారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌కు చెందిన అంబాల ప్రసాద్ ఆధ్వర్యంలో 9 మంది ముఠాగా ఏర్పడ్డారు.
లైవ్ మినిస్టీయల్ జీవజలం స్కీమ్ పేరిట రైతులు రూ. 33 వేలు చెల్లిస్తే బోరు వేసి, మోటారు ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం చేశారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కలిసి సుమారు 250 మంది రైతుల వద్ద రూ.75 లక్షలు మేర దండుకున్నారు. కొంతమంది రైతులకు బోర్లు వేసి అదనంగా రూ.3 వేలు వసూలు చేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన మిట్టపెల్లి సంపత్, బోర్‌వెల్ ఏజెంట్ యూదగిరితోపాటు మిరుదొడ్డి మండలం అల్వాల్‌కు చెందిన 30 మంది రైతులు వీరిపై హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన బోయిని కుమార్ అలియాస్ ప్రసన్నకుమార్, హుస్నాబాద్‌కు చెందిన చిలుముల మాలాకి, జేరిపోతుల భరత్ అలియాస్ లడ్డు, హుస్నాబాద్ మండలం జనగామకు చెందిన కత్తుల మురళి అలియాస్ మోజెస్‌లను అదుపులోకి తీసుకున్నారు.
ముఠాలోని ముఖ్యుడు అంబాల ప్రసాద్‌తోపాటు చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన శనిగరం శ్రీనివాస్, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కొలిమేర బాబు, హన్మకొండకు చెందిన తిరుపతి, సిరిసిల్లకు చెందిన ముక్కెర ప్రభాకర్ పరారీలో ఉన్నారని తెలిపారు.కాగా, లైవ్ మినిస్టీయల్ జీవజలం సంస్థకు చెందిన పాస్టర్లని చెబితే నమ్మానని రూ.2 కమీషన్‌కు బోర్‌వెల్ యంత్రాన్ని కిరాయికి తెచ్చి 101 బోర్లు వేశానని యాదగిరి చెప్పారు.