సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చట్టం తన పని తాను చేసుకుపోతోంది...అన్నట్టు పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ప్రక్రియ కూడా ఒకటొకటిగా పూర్తవుతూనే ఉంది. కానీ అక్కడి ప్రజల జీవనస్థితిగతులపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఆదివాసీ గిరిజనులతో నిండిన ఆ ఏడు మండలాలను పక్క రాష్ట్రానికి బదలాయించే ప్రక్రియకు లోక్‌సభ ఆమోదం కూడా లభించింది. త్వరలోనే రాజ్యసభలో కూడా బిల్లు పాసవుతుంది. మరీ ఆ మండలాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలు ఎప్పుడు అందుతాయి..? తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి వరకు సేవలందించాలి? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
ఏ ప్రభుత్వం తమకు ప్రభుత్వ పథకాలను అం దిస్తుందో..? ఏ ప్రభుత్వానికి తాము దరఖాస్తు చేసుకోవాలో..? తెలియని గందరగోళంలో ముంపు మం డలాల ప్రజలు ఉన్నారు. తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం ముంపు ప్రాంతవాసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఇక్కడ పాలన ఎలా సాగిస్తుందనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
ఈ మండలాల ప్రజలకు సంబంధించిన రికార్డులను ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా? సచివాలయం నుంచి ఉత్తర్వులు రానిదే జిల్లా యంత్రాంగం సహకరిస్తుందా? వచ్చే నెల అక్కడి ప్రజలకు రేషన్ ఇచ్చేదెవరు? పింఛన్లు పంచేదెవరు? ఫీజుల పథకం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి? సమస్య ఉంటే ఖమ్మం రావాలా? గోదావరి జిల్లా కేంద్రాలకు వెళ్లాలా? ఇలాంటి ప్రశ్నలెన్నో ముంపు వాసులను వేధిస్తున్నాయి.
పథకాల సంగతేంటి?
ప్రస్తుతానికి ముంపు మండలాల ప్రజలకు మన జిల్లా నుంచే సేవలందుతున్నాయి. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించినప్పుడే సాంకేతికంగా ఆ ప్రాంతం అక్కడికి వెళ్లిపోయినట్టు. ఇప్పటి వరకు ముంపు ప్రాంతం గురించి పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ సర్కారు.. ఆర్డినెన్స్‌కు లోక్‌సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని విలీనం చేసుకునే ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చు.
మరో 17 రోజుల్లో నెలవారీ రేషన్ ఇవ్వాలి? పింఛన్లు పంచాలి? వచ్చేనెల వీటిని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా? ఆంధ్ర ప్రభుత్వమే ఇవ్వాలా? ఒకవేళ ఆ ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తే దానికి సంబంధించిన ప్రక్రియంతా పూర్తవుతుందా? అన్నది అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ముంపు ప్రజలకు సంబంధించిన రికార్డుల మార్పు ఎప్పుడు జరుగుతుందనేది ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందనిదే ఇక్కడి రికార్డులను ఆ ప్రభుత్వానికి ఇచ్చే విషయంలో జిల్లా యంత్రాంగం సహకరించబోదని నిపుణులంటున్నారు.
మరి అలాంటప్పుడు చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లినందున అక్కడి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలా? కొన్నాళ్ల పాటు ఈ ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకోవాలా? అన్నది ముంపు వాసులకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునేందుకు ఏ ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నది అంతుచిక్కని ప్రశ్న. గృహ నిర్మాణం, ఉపాధి రుణాలు కాదు కదా... కనీసం ఓటరుకార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అక్కడి ప్రజలు తటపటాయిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ‘మన ఊరు - మన ప్రణాళిక’ సర్వేలు ముంపు మండలాల్లోనూ జరుగుతుండటం గమనార్హం. ఇక ఆ మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పరిస్థితి ఏంటో అంతుపట్టడం లేదు. ఆయా మండలాల్లో పనిచేస్తున్న వారిని తాత్కాలికంగా ఆంధ్రకే పంపుతారని, ఆ తర్వాత తెలంగాణ కేడర్‌కు తీసుకువస్తారని అంటున్నారు. మరోవైపు ఒకసారి అక్కడకు వెళ్లాక మళ్లీ ఈ రాష్ట్ర సర్వీసులోకి ఎలా తీసుకుంటారనే చర్చ ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. ముంపు మండలాల పరిస్థితిపై స్పష్టత ఎప్పుడు వస్తుందో అర్థంకాని పరిస్థితి ఉంది.
కోరుకున్న చోట పునరావాసమా?
మరోవైపు ఆర్డినెన్స్‌లో తమకు ఊరట కలిగించే అంశం ఒకటి ఉందనే ప్రచారం ముంపు మండలాల ప్రజల్లో ఆశలు రేపుతోంది. ముంపు ప్రాంత భూ భాగాన్ని బదలాయిస్తాం కానీ.. కోరుకున్న చోట ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తామని ఆర్డినెన్స్‌లో ఉందని, అలా అయితే తెలంగాణలోనే పునరావాసం కల్పించమని కోరవచ్చని గిరిజనులు భావిస్తున్నారు.
ఆర్డినెన్స్‌లో ఒకవేళ అలాగే ఉన్నా తెలంగాణలో భూభాగానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏమేరకు సహకరిస్తుందన్నది కూడా చర్చనీయాంశమే. కచ్చితంగా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే మాత్రం ఏపీ ప్రభుత్వానికి తాము సహకరించేది లేదని ముంపు వాసులు తెగేసి చెబుతున్నారు.
అవి రెండూ కలపగలరా?
ముంపు ప్రాంతాలు వెళ్లిపోతే జిల్లాలోని మూడు నియోజకవర్గాల స్వరూపం మారిపోనుంది. ముఖ్యంగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు వెళితే, మరో నాలుగు మండలాలు అక్కడ మిగులుతాయి. అశ్వారావుపేటలో రెండు మండలాలు, పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలంలో ఆరు గ్రామాలు ఆంధ్రకు బదలాయించబడతాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లోపు మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? అనే చర్చ జరుగుతోంది.
భద్రాచలం పట్టణం, బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలను కలిపి ఒకే మండలం చేయగలుగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అవి రెండూ, రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి. రెండింటినీ కలిపితే ఏర్పడే మండలాన్ని ఏదో ఒక నియోజకవర్గంలో కలపాలి. అలా కలపడానికి పునర్విభజన చట్టం అనుమతించదు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణాన్నే మండలం చేస్తారా? లేక భద్రాచలం అసెంబ్లీలోని వేరే మండలంలో కలుపుతారా? బూర్గంపాడు కేంద్రంగా 12 గ్రామాలతో కలిపి మండలాన్ని ఏర్పాటు చేస్తారా? అనేది కూడా తేలాల్సి ఉంది.
‘ముంపు’ తికమక
Published Sun, Jul 13 2014 2:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement