సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియామక సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అత్యధికంగా ఉద్యోగులు గురుకుల పాఠశాలల్లోనే నియామకమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 8 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. కాంట్రాక్టు సిబ్బందికి సొసైటీలే నేరుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోగా.. వంట సిబ్బంది, వాచ్‌మెన్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లోని పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు.
ఫిర్యాదులతో కదిలిన సొసైటీలు
ఈ నియామకాల క్రమంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల గురుకుల సొసైటీలకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన సొసైటీ యంత్రాంగం ఒకట్రెండు చోట్ల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రతి కేటగిరీలో 2 నెలల నుంచి 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు తేలింది. దీంతో కంగుతిన్న యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో నియమించిన ప్రతి ఉద్యోగి నుంచి సమాచారం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రూ.లక్ష వరకు వసూలు
గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ క్రమంలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు పెద్దమొత్తంలో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన దాదాపు 12 మంది ఉద్యోగులు ఇలా సొసైటీ కార్యదర్శులకు లేఖలు సమర్పించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు వారు అందులో పేర్కొన్నారు. కొంత మంది కిందిస్థాయి (వాచ్‌మెన్) ఉద్యోగుల దగ్గర 3 నెలల వేతనం, మరికొందరి దగ్గర 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదులపై సొసైటీ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టగా పై అంశాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాల తంతు బయటపడే అవకాశముంది.
గురుకుల నియామకాల్లో ‘ఔట్‌సోర్సింగ్’ అవినీతి
Published Fri, Mar 22 2019 12:44 AM | Last Updated on Fri, Mar 22 2019 12:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment