చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
- రంగారెడ్డి జెడ్పీపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీ
- సొంత సభ్యులను కాపాడుకునేందుకు తంటాలు
- విహారయాత్రల పేరిట సభ్యులను రాష్ట్రం దాటించిన పార్టీలు
- హస్తంతో చేతులు కలిపిన ‘దేశం’!
- వైస్ చైర్మన్ పదవి కోసమే స్నేహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకవపోవడంతో రంగారెడ్డి జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. అధ్యక్ష పీఠం కోసం పార్టీలు నడుపుతున్న క్యాంపులు జోరందుకుంటున్నాయి. ఒకవైపు సొంత జెడ్పీ సభ్యులను కాపాడుకుంటూనే, మరోవైపు పొరుగు పార్టీల జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు పోటీపడుతున్నాయి. చైర్మన్ పీఠం కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ ‘17’ సభ్యులను సమకూర్చుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రతిష్టాత్మక జిల్లా చైర్మన్ పదవిని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. తొలిసారి జెడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ తహతహలాడుతోంది.
విందులు, విహార యాత్రలు
జెడ్పీటీసీ సభ్యులు పక్క పార్టీల ప్రలోభాలకు లొంగకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు శిబిరాలు ఏర్పాటు చేసి ఎత్తు లు వేస్తున్నాయి. సభ్యులందరినీ విహారయాత్రల పేరిట జిల్లాలో లేకుండా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళారు. అత్యధిక సంఖ్యలో 14 మంది జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. వారి సభ్యులను మేనేజ్ చేసే బాధ్యతను పార్టీలోని ఓ సీనియర్ నేతకు అప్పగించారు. దీంతో కార్యరంగంలో దిగిన ఆయన 14 మంది జెడ్పీటీసీ సభ్యులను తొలుత షిర్డీకి తరలివెళ్లారు. అటు నుంచి అటు వారందరూ గోవా వెళ్తున్నట్టు సమాచారం.
హస్తంతో సైకిల్ మిలాఖత్
జెడ్పీలో హంగ్ కారణంగా మునుపెన్నడూ లేని సరికొత్త సమీకరణలు తెరమీదకొచ్చాయి. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ చైర్మన్ పదవి విషయంలో చేతులు కలిపాయి. ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ చైర్మన్ పదవి అప్పగిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌కు టీడీపీ అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు భారీగా తాయిలాలు కూడా ముట్టజెప్తామనడంతో వారు మరోమాట లేకుండా ఓకే చెప్పినట్లు తెలిసింది.
ఇక ఇరు పార్టీలు వారు పరస్పర అంగీకారంతో క్యాంపులు నడుపుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ జిల్లా పరిషత్ సభ్యులు చేజారకుండా విహారయాత్రలకు తరలించగా, టీడీపీ సభ్యులకు నగర శివారులోని ఫిలింసిటీలో విడిది ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక తెలంగాణలో అధికారం చేపట్టనున్న టీఆర్‌ఎస్ పార్టీ కూడా జెడ్పీ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పక్క పార్టీల జెడ్పీలకు ఊహించని తాయిలాలు ప్రకటిస్తూ వారిని తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు తమ సభ్యులు పక్క చూపులు చూడకుండా వారిని ఇప్పటికే చెన్నై షిఫ్ట్ చేశారు. ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ వారందరికీ విందు, వినోదాలు ఏర్పాటు చేశారు. మరోవైపు జెడ్పీటీసీల మద్దతు విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు మైండ్‌గేమ్‌కు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు సభ్యులు తమ పార్టీలో చేరుతున్నారని టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుండగా...కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు పలువురు తమతో టచ్ ఉన్నారని, టీడీపీ వారూ మద్దతిస్తున్నారని అంటోంది. ఈనేపథ్యంలో జెడ్పీ పీఠం ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.