నకిలీ విత్తనాలతో కుళ్లిన వరి
ఐదున్నర ఎకరాల్లో పంట నష్టం
హవేళిఘణాపూర్ (మెదక్): మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రాజేందర్‌రెడ్డి, రాంరెడ్డి నకిలీ విత్తనాలతో మోసపోయారు. మెదక్ పట్టణంలోని రైతునేస్తం ఫర్టిలైజర్ దుకాణంలో ఆమోగ్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి వీరు తూకాలు పోశారు. గత నెల తూకాలను తీసి నాట్లు వేశారు.
17 రోజులు గడుస్తున్నా వరి పైరు పెరగకపోగా, పంటంతా కుళ్లి పోయింది. వేళ్ల నుంచి మొదలుకొని ఆకులు మొత్తం ఎండిపోయాయి. ఐదున్నర ఎకరాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.80 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటంతా కళ్ల ముందే కుళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాగమాధురి పొలాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.