
పాలమూరుకు ముహూర్తం నెలాఖరులో..
► ప్రారంభంకానున్న నిర్మాణ పనులు
► బడ్జెట్‌లో అగ్రతాంబూలం
► ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
► మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రాక.?
► సాంకేతిక చర్యలపై అధికారుల కసరత్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రతిష్టాత్మక పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మంచిరోజులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో ఈ ఎత్తిపోతల పథకానికే ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ మేరకు అధికారుల సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన పనులను 18 ప్యాకేజీలుగా టెండర్లను ఖరారు చేయడంతో ఇక పాలమూరు నిర్మాణం పరుగులు తీయనుందని ప్రజలు భావిస్తున్నారు.
పూర్తికాని భూ సేకరణ..
సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు సమాయత్తమవుతున్నా దీనికి సంబంధించి నాలుగు జలాశయాల పరిధిలో భూసేకరణ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పరిధిలో మొత్తం 16 లక్షల 446 వేల 40 ఎకరాల భూమిని ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించాలని సంకల్పించారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూ కొనుగోలును వేగవంతం చేస్తూ రిజిస్ట్రేషన్‌లను పూర్తిచేస్తున్నారు. మరోవైపు భూసేకరణ వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై వివిధ జలాశయాల పరిధిలోని ముంపుబాధితుల్లో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. కొందరైతే నష్టపరిహారాన్ని పెంచాలంటూ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అనుకున్న సమయానికి పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించే లక్ష్యంతో ఈ నెలాఖరుకు నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
గత జూన్‌లో శంకుస్థాపన
ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం జూన్ నెల 11వ తేదీన కర్వెన ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం వెనుక భాగం నుంచి నార్లాపూర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా రూపొందిన ఈ పథకం కింద ఉద్దండాపూర్ జలాశయం వరకు నీటిని తరలించేందుకు గాను టెండర్లను పూర్తిచేశారు. మార్చి నెల చివరి వారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్‌తోపాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును ఆహ్వానించి పనులను ప్రారంభింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు మంత్రిని జిల్లాకు చెందిన అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఆహ్వానించినట్లు సమాచారం.
పనుల ప్రారంభానికి అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం బడ్జెట్‌లో దాదాపు 7 వేల 860 కోట్ల రూపాయలను కేటాయించడంతో పనులను వేగవంతంగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే జలాశయాల పరిధిలో సేకరించిన భూమి.. ఇంకా సేకరించాల్సింది ఎంత.. నిర్మాణ పనులకు తక్షణం ఎంత భూమి అవసరమవుతుందన్న అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూమిని అధికారికంగా సాగునీటి అధికారులకు అప్పగించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏయే ప్రాంతంలో ఎంత భూసేకరణ జరిగింది. అందులో రిజిస్ట్రేషన్ జరిగి నిర్మాణ పనులకు సిద్ధంగా ఉన్న భూమి ఎంతన్న అంశాన్ని రెవెన్యూ అధికారులు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.