
పెద్ద కూలీ ఐఏఎస్సే
- ప్రేమతోనే సివిల్స్‌లోకి రావాలి
- సీనియర్ ఐఏఎస్‌ల ఉద్ఘాటన
సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో అతి పెద్ద కూలీ ఐఏఎస్ అధికారే.. ప్రజలపై విపరీతమైన ప్రేమ, సమస్య-పరిష్కారాలే శ్వాస ధ్యాసగా భావించే మనస్తత్వం, జన శ్రేయస్సే లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీస్‌లోకి అడుగుపెట్టాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో అన్నింటి కన్నా విలువైన పరీక్ష నేడు సివిల్స్ ఎగ్జామ్ అని తెలిపారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో తెలిసి వచ్చే ప్రతి అంశం సివిల్ సర్వీస్‌లో ఒక పాఠం లాంటిదనే విషయం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తెరగాలని కోరారు. మున్ముందు తెలుగువారు అత్యధికులు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
సీనియర్ అధికారులు డాక్టర్ ఏ అశోక్, డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు నేటి తరం విద్యావంతులను సివిల్ సర్వీసుల వైపు కార్యోన్ముఖులను చేసేందుకు పుస్తకాలు రాయటం, అవగాహన కల్పించటం ఆదర్శ ప్రాయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ 120 కోట్ల మంది ఉన్న దేశంలో అటు సమాజాన్ని, ఇటు జన జీవితాన్ని ప్రభావితం చేసే అతి గొప్ప సర్వీసు సివిల్స్ అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అధర్ సిన్హా మాట్లాడుతూ సివిల్స్‌లో పద్ధతి ప్రకారం చదివితే విజయం సొంతమన్నారు.
సభకు అధ్యక్షత వహించిన తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే సమాచారం ఇస్తే మరిన్ని పుస్తకాల్ని తాము అచ్చు వేస్తామన్నారు. పుస్తకరచయితలు కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకొని సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా తమను సంప్రదిస్తే కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధమేనని చెప్పారు.
అనంతరం ‘మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా?’ అనే పుస్తకాన్ని అజయ్ మిశ్రా ఆవిష్కరించారు. ఆంత్రోపాలజీకల్ తాట్, సోషియో కల్చరల్ ఆంత్రోపాలజీ పుస్తకాలను కళాశాల విద్య కమిషనర్ కె. సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్. శశిధర్‌రావు, ఎ.దినకర్ బాబు, డాక్టర్ ఎం జగన్మోహన్, డాక్టర్ యు.వెంకటేశ్వర్లు, వాణీ ప్రసాద్ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఏ. అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.