ప్రాచీన సంపద పరిరక్షణ పట్టదా ?
- చారిత్రక కట్టడాలపై నిర్లక్ష్యం
- హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ రద్దుతో ఇబ్బంది
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలోని చారిత్రక సంపద పరిరక్షణ ఇప్పుడు ఎవరికీ పట్టకుండా పోయింది. ఏడాదిన్నర గడిచినా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం 2010 మార్చి 17న నియమించిన‘హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ’ 2013 మార్చి 17 నాటికి కాలపరిమితి ముగియడంతో రద్దయిపోయింది. సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు దీనిగురించి పట్టించుకొన్న నాథుడే లేడు.
ఇప్పటికే వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన వివిధ భవనాలకు సంబంధించి అతిక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం మెట్రో రైల్ మార్గంలో పలుచోట్ల చారిత్రక వారసత్వ కట్టడాలు అడ్డువస్తుండటంతో వాటి పరిరక్షణ వ్యవహారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. వీటికి కలిగే నష్టంపై నివేదిక ఇచ్చేందుకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ లేకపోవడంతో తీవ్ర నష్టం కలగనుంది.
ఎలా సాధ్యం?
నగరంలో చారిత్రక వారసత్వ కట్టడాలకు నష్టం కలుగనివ్వమని, అవసరమైతే భూగర్భంలో మెట్రో రైల్ మార్గాన్ని నిర్మిస్తామని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ప్రాచీన కట్టడాల పరిరక్షణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. మెట్రోరైల్ ప్రాజెక్టు సమీక్షా సమావేశం సందర్భంగానైనా అధికారులు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేకపోయారు. నిజానికి 2010 మార్చి 17న తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని గత ప్రభుత్వం నియమించింది.
ఈ కమిటీలో చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.రాజమణిని, సభ్యులుగా కె.రమేష్ (ఇంజనీర్), అన్వర్ అజీజ్ (ఆర్కిటెక్), సంజయ్ తొర్వి (ఆర్కిటెక్)ని నియమించింది. అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డెరైక్టర్‌ను, ఎం.విశ్వనాథన్ (ప్రొఫెసర్ జేఎన్‌టీయూ), సాజిద్ సాహిద్, ఫరూఖ్ ఖాదర్‌లను సభ్యులుగా, హెచ్‌ఎండీఏ అర్బన్ ప్లానర్ విభాగం నుంచి ఒకరిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం (జీఓ.ఎం.ఎస్.నెం.124, ఎం.ఏ) ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి నిర్దిష్ట కాలపరిమితి ముగిసిపోవడంతో అది రద్దయింది.
కనిపించని ఫలకాలు
చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భవనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలకాలు కనుమరుగయ్యాయి. గతంలో బీపీ ఆచార్య హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్నప్పుడు చారిత్రక వారసత్వ భవనాలకు ప్రత్యేకంగా ఓ ఫలకాన్ని ఏర్పాటు చేసి ఆ భవనం తాలుకు వివరాన్నీ అందులో పొందుపర్చారు. అప్పట్లో బేగంపేట లోని పైగా ప్యాలెస్ (ప్రస్తుత యూఎస్ కన్సోలేట్), గ్రీన్‌ల్యాండ్ గెస్ట్ హౌస్ భవనాలకు ప్రత్యేకంగా ఫలకాలను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆయన బదిలీ కావడంతో ఆ బాధ్యతలను చేపట్టిన అధికారులు ఫలకాల ఏర్పాటుకు తిలోదకాలిచ్చారు. ఫలితంగా ఏది పురాతన భవనమో..? లేక ఏది చారిత్రక వారసత్వ కట్టడమో..? ప్రజలకు తెలియని పరిస్థితి ఎదురైంది.